Naveen Jindal Tweet: మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకుగానూ భాజపా నుంచి బహిష్కరణకు గురైన పార్టీ మాజీ అధికార ప్రతినిధి నవీన్ జిందాల్ శనివారం అర్ధరాత్రి ట్విటర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ వర్గం నుంచి తన కుటుంబానికి హాని ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో తమ వివరాలను ఎవరూ బహిర్గతం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. "నా గురించి, నా కుటుంబం గురించి దయచేసి ఎవరూ ఎటువంటి వివరాలు ఎవరికీ చెప్పొద్దు. నేను అనేకసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ.. చాలా మంది నా నివాసానికి సంబంధించిన చిరునామాను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. ఇస్లామిక్ ఫండమెండలిస్ట్‌ల నుంచి నా కుటుంబానికి ప్రమాదం పొంచి ఉంది" అని జిందాల్ ట్విట్టర్లో రాసుకొచ్చారు. పలువురి నుంచి తనకు బెదిరింపులు వచ్చినట్లు చెబుతూ కొన్ని స్క్రీన్‌షాట్లను జిందాల్ ట్విట్టర్లో పంచుకున్నారు.
పలు చోట్ల హింసాత్మకం.. మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలకు గాను భాజపా మాజీ అధికార ప్రతినిధులు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌ను అరెస్టు చేయాలని కోరుతూ శుక్రవారం నిర్వహించిన నిరసన ప్రదర్శనలు పలుచోట్ల హింసాత్మకంగా మారాయి. ఆ ఘటనల ప్రభావం కొన్ని ప్రాంతాల్లో శనివారం కూడా కనిపించింది. హావ్‌డాలోని పాంచలా బజార్‌లో నిరసనకారులు పోలీసులతో ముఖాముఖి తలపడ్డారు. దిల్లీలోని జామా మసీదు వద్ద అనుమతిలేకుండా నిరసన కార్యక్రమం నిర్వహించడాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు శనివారం పలువురిపై కేసు నమోదు చేశారు. పలు హింసాత్మక ఘటనలు జరిగిన రాంచీ నగరంలో శనివారం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
సమన్లు జారీ చేసిన భీవండి పోలీసులు.. నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌కు మహారాష్ట్రలోని భీవండి పోలీసులు ఆదివారం సమన్లు జారీ చేశారు. జూన్ 15న వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సిందిగా నవీన్ జిందాల్‌ను కోరినట్లు సీనియర్ పోలీస్‌ఇన్‌స్పెక్టర్ చేతన్ తెలిపారు. మే 30న రజా అకాడమీ ప్రతినిధి చేసిన ఫిర్యాదు మేరకు వారిద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. అంతకుముందు ముంబ్రా పోలీసులు.. వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి జూన్ 22న తమ ముందు హాజరు కావాలని నుపుర్‌శర్మను కోరారు. దీంతో పాటు ముంబయి పోలీసులు జూన్ 25న హాజరుకావాలని ఆమెకు తెలిపారు.
ఇవీ చదవండి: దేశవ్యాప్తంగా ముస్లింల భారీ ప్రదర్శనలు.. పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు
మహిళ ముఖంపై బ్లేడుతో దాడి.. 118 కుట్లు.. రంగంలోకి సీఎం!