కశ్మీరీ పండిత్ అంత్యక్రియల నిర్వహణకు పొరుగున ఉండే ముస్లింలు సాయం చేశారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్ కుల్గాం జిల్లాలో జరిగింది.
కాక్రన్ గ్రామానికి చెందిన సురేందర్ సింగ్ రాజ్పుత్ అనే వ్యక్తి బుధవారం మృతి చెందాడు. కుల్గాంలో ముస్లింలతో కలసి నివసిస్తోన్న అతికొద్దిమంది కశ్మీరీ పండిత్లలో సురేందర్ సింగ్ ఒకరు. ఆయన 1984 నుంచి ఇక్కడే ఉంటున్నారు.
దగ్గరుండి మరీ..
రాజ్పుత్ మరణవార్త తెలిసిన వెంటనే ఆ ప్రాంతంలో ఉండే ముస్లింలు కలసికట్టుగా అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. మృతదేహాన్ని మోసుకెళ్లడంలోనూ సాయపడ్డారు. అనేక మంది ముస్లింలు రాజ్పుత్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
చనిపోయిన వ్యక్తి మాకు పెద్దన్న లాంటివాడు. నేనైతే తరచుగా అతన్ని కలిసి, వివిధ అంశాల్లో సలహాలు తీసుకుంటుండేవాణ్ని.
-స్థానికుడు
అంతక్రియలు నిర్వహించడం పొరుగువారిగా తమ కర్తవ్యంలో భాగమేనని గ్రామస్థులు తెలిపారు.
ఇదీ చదవండి: భారత్-పాక్ నిర్ణయంపై కశ్మీరీ నేతల హర్షం