Mumbai NCB drugs: రెండు రోజుల వ్యవధిలో ముంబయిలోని ఎనిమిది వేర్వేరు ప్రాంతాల్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) తనిఖీలు నిర్వహించింది. మొత్తం తొమ్మిది కిలోల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంది. వీటి విలువ రూ.13 కోట్లు ఉంటుందని ఆ సంస్థ అధికారి సమీర్ వాంఖడే వెల్లడించారు.
Sameer Wankhede news
సీజ్ చేసిన డ్రగ్స్‌ను విదేశాలకు ఎగుమతి చేయాలని చూశారని వాంఖడే వెల్లడించారు. మైక్రోఒవెన్, టై, స్టెతస్కోప్, హెల్మెట్ వంటి పరికరాల్లో డ్రగ్స్ దాచి.. ఇతర దేశాలకు పంపేందుకు యత్నించారని చెప్పారు. అనేక నకిలీ పేర్లు, ఐడీ కార్డులను నిందితులు ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు.
స్టెతస్కోప్‌లో నాలుగు కేజీలు, హెల్మెట్‌లో కేజీ నార్కోటిక్స్ లభించాయని వాంఖడే వివరించారు. కంప్యూటర్ హార్డ్ డిస్కులో 17 గ్రాముల మాదకద్రవ్యాలు ఉన్నాయని వెల్లడించారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు వీటిని పంపాలని అనుకున్నారని తెలిపారు.
గత రెండు నెలలుగా డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతోందని అధికారులు తెలిపారు. స్మగ్లర్లు కొరియర్ సేవలను ఉపయోగించుకొని డ్రగ్స్‌ను రవాణా చేస్తున్నారని పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల కోసం మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉన్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: ఏడేళ్ల చిన్నారి దారుణ హత్య- నోటిలో రాళ్లు వేసి..