భాజపాను వీడి సొంతగూటికి చేరిన టీఎంసీ నేత ముకుల్ రాయ్.. కేంద్ర భద్రతను వదులుకునేందుకు సిద్ధమయ్యారు. బంగాల్ సీఎం మమతా బెనర్జీ సమక్షంలో శుక్రవారం టీఎంసీలో చేరిన ముకుల్.. తనకు కేటాయించిన భద్రతను ఉపసంహరించాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు.
టీఎంసీలో చేరిన తర్వాత ముకుల్ రాయ్‌కు బంగాల్ ప్రభుత్వం జడ్ కేటగిరీ భద్రతను కల్పించింది. ఆయన కుమారుడు సుబ్రాన్షుకు వై కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ భద్రత పొందుతున్న నేపథ్యంలో సెంట్రల్ సెక్యురిటీని ముకుల్ రాయ్ వద్దనుకుంటున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై కేంద్రం స్పందన ఇంకా తెలియరాలేదు.
మమతా బెనర్జీకి అత్యంత ఆప్తుల్లో ఒకరైన ముకుల్.. పార్టీ ప్రారంభం నుంచి కీలకంగా పనిచేశారు. అయితే 2017లో దీదీతో రాజకీయపరమైన విబేధాలు రాగా పార్టీకి దూరమయ్యారు. ఈ క్రమంలోనే పార్టీ అనుమతి లేకుండా భాజపా నేతలను కలిసి తృణమూల్ కాంగ్రెస్ అధిష్ఠానం ఆగ్రహానికి గురయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు భాజపాలో చేరి, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. భాజపాలో ఇమడలేక మళ్లీ సొంత పార్టీకే తిరిగివచ్చారు.
ఇదీ చదవండి: మోదీకి అధిర్ రంజన్ చౌదరి లేఖ!