తనపై అత్యాచారం చేయాలనుకున్న ఓ దుర్మార్గుడికి తగిన రీతిలో బుద్ధి చెప్పింది మధ్యప్రదేశ్‌కు చెందిన మహిళ. అఘాయిత్యానికి పాల్పడేందుకు ఇంట్లోకి చొరబడిన వ్యక్తి మర్మాంగాన్ని కోసేసింది. సిధి జిల్లాలోని ఉమారియా గ్రామంలో ఈ ఘటన జరిగింది.
గురువారం రాత్రి 11 గంటలకు ఈ ఉదంతం జరిగిందని ఖాదీ ప్రాంత ఎస్సై ధర్మేంద్ర సింగ్ రాజ్‌పుత్ తెలిపారు. ఆ సమయంలో తన భర్త పని మీద వేరే ప్రాంతానికి వెళ్లినట్లు మహిళ(45) చెప్పిందని వెల్లడించారు. 13 ఏళ్ల కొడుకు కూడా మహిళతో పాటు ఉన్నాడని చెప్పారు. నిందితుడు(45) ఇంట్లోకి చొరబడగానే.. దొంగలు వచ్చారని భయపడి బయటకు పరుగులు తీశారని వివరించారు.
"మహిళను కొట్టి లైంగికంగా దాడి చేసేందుకు నిందితుడు యత్నించాడు. 20 నిమిషాలకు పైగా నిందితుడిని మహిళ నిలువరించింది. తనను తాను కాపాడుకునేందుకు మంచం కింద ఉన్న కొడవలి తీసి.. నిందితుడి మర్మాంగాన్ని కోసేసింది. తర్వాత పోలీస్ స్టేషన్‌కు వచ్చి రాత్రి 1.30 గంటలకు ఫిర్యాదు చేసింది."
-ధర్మేంద్ర సింగ్ రాజ్‌పుత్, ఖాదీ ఎస్సై
నిందితుడిని ప్రాథమిక చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు రాజ్‌పుత్. అనంతరం సిధి జిల్లా ఆస్పత్రికి, వైద్యుల సూచనతో మెరుగైన చికిత్స కోసం సంజయ్ గాంధీ బోధనాసుపత్రికి మార్చినట్లు చెప్పారు. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.
అయితే, నిందితుడు సైతం మహిళపై ఫిర్యాదు చేశాడని పోలీసులు తెలిపారు. దీంతో మహిళపై ఐపీసీ సెక్షన్ 327 ప్రకారం కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: అత్యాచారం జరిగిన 17ఏళ్లకు ఫిర్యాదు