రెండు దశాబ్దాల క్రితం తప్పిపోయి.. పాకిస్థాన్‌లో జైలు శిక్ష (Pakistani jail) అనుభవించిన ఓ వ్యక్తి తిరిగి భారత్ చేరుకున్నాడు. వాఘా సరిహద్దు వద్ద అతడిని సరిహద్దు భద్రతా దళాని(బీఎస్ఎఫ్)కి సోమవారం అప్పగించారు పాక్ అధికారులు. మధ్యప్రదేశ్‌కు చెందిన అతడు.. మంగళవారం సాయంత్రానికల్లా స్వగ్రామానికి చేరుకుంటాడని పోలీసులు తెలిపారు.
ఏం జరిగిందంటే?
సాగర్ జిల్లాకు చెందిన ప్రహ్లాద్ సింగ్ రాజ్‌పుత్ (57) 23 ఏళ్ల కిందట కనిపించకుండాపోయారు. అనుకోకుండా సరిహద్దులు దాటి పాకిస్థాన్‌లోకి ప్రవేశించాడు. "దీంతో అతడిని అరెస్టు చేసి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని జైల్లో బంధించారు. అనంతరం రావల్పిండి జైలుకు తరలించారు. పాక్‌లో అతడు ఎంత కాలం జైలు జీవితం గడిపింది స్పష్టంగా తెలియాల్సి ఉంది" అని సాగర్ జిల్లా ఎస్పీ అతుల్ సింగ్ తెలిపారు.
2015లోనే అతడి గురించి..
మానసిక రుగ్మతలతో తమ జైళ్లలో ఉన్న 17 మంది గురించి పాక్ అధికారులు భారత్‌కు 2015లో సమాచారమిచ్చినట్లు అతుల్ వెల్లడించారు. "ప్లహ్లాద్ పేరు కూడా అందులో ఉంది. కానీ ఆ సమయంలో అతడిని గుర్తించడానికి వీలుపడలేదు. ఈ వ్యవహారంపై గతేడాది సాగర్ ఎస్పీ కార్యలయంలో అతడి సోదరుడు దరఖాస్తు పెట్టారు. దాని ఆధారంగా ప్రహ్లాద్ ఆచూకీ ధ్రువీకరించాం" అని ఎస్పీ వివరించారు.
మరో ఇద్దరికీ విముక్తి..
అక్రమంగా సరిహద్దులు దాటినందుకు 8ఏళ్లుగా పాక్ జైళ్లలో మగ్గుతున్న మరో ఇద్దరు వ్యక్తులకూ విముక్తి లభించింది. భారత పౌరులు శర్మ రాజ్‌పుత్, రామ్ బుహదార్లను మంగళవారం వాఘా బోర్డర్ వద్ద బీఎస్ఎఫ్కు అప్పగించింది పాక్. 2013లో ఎల్ఓసీ దాటిన వారిని అరెస్టు చేసిన పాక్ రేంజర్లు ఇద్దరికీ మతిస్థిమితం లేదని గుర్తించి వదిలేశారు.
2019లోనూ
2019లోనూ మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అనుకోకుండా పాకిస్థాన్ సరిహద్దు దాటి, ఈ ఏడాది జూన్‌లో స్వగ్రామానికి చేరుకున్నాడు.
ఇంకా తేలలేదు..
అయితే గతేడాది అక్రమంగా సరిహద్దు దాటారనే కారణాలపై అరెస్ట్ అయిన 19 మంది భారత పౌరులు ఇప్పటికీ పాక్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ వ్యవహారం ఫెడరల్ రివ్యూ బోర్డు వద్ద పెండింగ్‌లో ఉంది.
ఇదీ చూడండి: Afghanistan Taliban:'తాలిబన్లను నడిపిస్తోంది పాకిస్థానే'