చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ, చనిపోయినట్లు నమ్మించి మోసం చేసిన వ్యక్తిని.. 9 నెలల తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ ఛతర్‌పుర్ జిల్లాలో జరిగిందీ ఘటన. ఆ వ్యక్తి చనిపోయాడని అనుకుని అతడి కుటుంబసభ్యులు గతేడాదే అంత్యక్రియలు నిర్వహించారు. అయితే.. డీఎన్ఏ నివేదిక సరిపోలకపోవడం వల్ల అసలు విషయం బయటపడింది.
చోరీ.. అదృశ్యం.. మరణం!: గతేడాది జులై 16న సుధీర్ అగర్వాల్ అనే వ్యాపారి బమితా పోలీస్ స్టేషన్లో ఓ ఫిర్యాదు చేశారు. పికప్ ట్రక్ డ్రైవర్ అయిన సునీల్ నామ్‌దేవ్ తనను మోసం చేసి, డబ్బులు కాజేశాడని ఆరోపించారు. తాను పంపిన ఐరన్ లోడును రాజ్‌నగర్‌లో దింపి, అక్కడి వారు ఇచ్చిన రూ.6.65లక్షలు తీసుకుని మాయం అయిపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నారు సుధీర్.
కొద్దిరోజుల తర్వాత సునీల్ నడిపే వాహనం ఓ గోదాము దగ్గర కనిపించింది. జులై 24న బమితా ఠాణా పరిధిలోని కోడాహర్ ప్రాంతంలో గుర్తుతెలియని శవం పడి ఉంది. అది సునీల్దేనంటూ అతడి కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కానీ.. మృతదేహం సాంపిళ్లు సేకరించి చేసిన డీఎన్ఏ పరీక్ష ఫలితాలు.. సునీల్ కుటుంబసభ్యుల డీఎన్ఏతో సరిపోలలేదు. ఫలితంగా మళ్లీ దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.
మే 3న బాగేశ్వర్ ధామ్ అలయానికి వెళ్తున్న సుధీర్‌కు.. గధా టిగడ్డ ప్రాంతంలో సునీల్ కనిపించాడు. తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని అడిగాడు. సునీల్ ఎదురుదాడికి దిగాడు. ఇప్పటికే తాను పోలీసు రికార్డుల్లో చనిపోయానని, తన జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించాడు.
సుధీర్ అగర్వాల్ పోలీసులకు అసలు విషయం చెప్పారు. వారు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గతవారం సునీల్‌ను అరెస్టు చేశారు. అతడి దగ్గర ఉన్న రూ.5లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.