దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతితో లక్షల మంది వైరస్ బారిన పడుతున్నారు. వైద్య సిబ్బంది, పోలీసులు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి సేవలందిస్తున్నారు. ఆ కోవకే చెందుతారు మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వైద్యురాలు. మండుటెండలో 180 కిలోమీటర్లు ద్విచక్రవాహనంపై ప్రయాణించి కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు.
స్కూటీపైనే..
మధ్యప్రదేశ్‌కు చెందిన వైద్యురాలు ప్రగ్యా ఘడే.. మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని కొవిడ్ కేర్ సెంటర్లో విధులు నిర్వర్తిస్తున్నారు. లాక్డౌన్ విధించిన క్రమంలో ఇటీవలే తమ స్వగ్రామం ఎంపీలోని బాలాఘట్కు వెళ్లారు. అయితే.. కేసులు భారీగా పెరగడం వల్ల ఆసుపత్రిలో పరిస్థితి తెలుసుకున్న వైద్యురాలు చలించిపోయారు. వెంటనే విధుల్లో చేరాలని నిశ్చయించుకున్నారు. లాక్డౌన్లో ఎలా వెళ్లగలనని ఒక్క క్షణం కూడా ఆలోచన చేయలేదు. వెంటనే తన స్కూటీ తీసుకుని ప్రయాణం మొదలు పెట్టారు. మండుటెండలో 7 గంటల పాటు ఎలాంటి ఆహారం లేకుండా 180 కిలోమీటర్లు ప్రయాణించారు. నాగ్‌పుర్‌లోని ఆసుపత్రికి చేరుకుని సేవలందిస్తున్నారు. ప్రస్తుత క్లిష్ట సమయంలో తన గురించి ఆలోచన చేయకుండా విధుల్లో చేరిన వైద్యురాలిని తోటి సిబ్బంది, ఉన్నతాధికారులు ప్రశంసించారు.
"లాక్డౌన్ సమయంలో బాలాఘట్కు వచ్చాను. కానీ కరోనా కేసులు విపరీతంగా పెరిగాయని సమాచారం అందింది. నాగ్‌పుర్ తిరిగి వెళ్లేందుకు ఎలాంటి రవాణా సౌకర్యాలు లేవు. దాంతో నా ద్విచక్రవాహనంపైనే ఆసుపత్రికి చేరుకోవాలని నిర్ణయించుకున్నాను. తొలుత మా తల్లిదండ్రులు నిరాకరించినా.. తర్వాత అనుమతించారు."
- ప్రగ్యా ఘడే, వైద్యురాలు.
నాగ్‌పుర్‌లోని కొవిడ్ కేర్ సెంటర్లో ఆరు గంటల పాటు రోగులకు సేవలందిస్తున్నట్లు చెప్పారు ప్రగ్యా. ఆ తర్వాత మరో ఆసుపత్రికి వెళ్లి కరోనా బాధితులకు సాయం చేస్తున్నట్లు తెలిపారు. రోజులో 12 గంటల పాటు పీపీఈ కిట్టు ధరించి విధులు నిర్వర్తిస్తున్నానని, ఈ క్లిష్ట సమయంలో రోగులకు సాయం చేయటం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు.
ఇదీ చూడండి: ఆక్సిజన్ కొరతతో ఐదుగురు కరోనా రోగులు మృతి