MP Dhiraj Sahu Raid Reaction : ఆదాయపు పన్ను శాఖ జరిపిన దాడుల్లో పట్టుబడిన రూ. 353కోట్ల డబ్బు తన ఒక్కడిదే కాదని కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహు తెలిపారు. తమ కుటుంబం వందేళ్లకు పైనుంచి మద్యం వ్యాపారం చేస్తోందని, పట్టుబడిన డబ్బు ఆ కంపెనీలకు చెందినదన్నారు. వాటికి సంబంధించిన అన్ని లెక్కలు తమ కుటుంబం చెబుతుందని ధీరజ్ ప్రసాద్ సాహు స్పష్టం చేశారు.
'మాది ఉమ్మడి కుటుంబం. వందేళ్లకు పైనుంచి మద్యం వ్యాపారం చేస్తున్నాం. పట్టుబడిన డబ్బు మద్యం కంపెనీలకు సంబంధించినది. మద్యం అమ్మకాల నుంచి వచ్చిన డబ్బు అది. దాన్ని నల్లధనమని కొందరు ప్రచారం చేస్తున్నారు. అది నల్లధనమా లేక తెల్లధనమా అనేది ఆదాయపు పన్ను శాఖ తేలుస్తుంది. మా కుటుంబసభ్యులు దానికి సమాధానం ఇస్తారు. కాంగ్రెస్ లేదా మరో పార్టీకి సంబంధించిన డబ్బు కాదని స్పష్టంగా చెబుతున్నా' అని ధీరజ్ ప్రసాద్ సాహు వివరించారు.
ఇదీ జరిగింది
ఇటీవల ఆదాయపు పన్ను శాఖ ఒడిశాలో సోదాలు నిర్వహించి లెక్కల్లోకి రాని రూ.353 కోట్ల సొమ్మును స్వాధీనం చేసుకుంది. ఒకే ఘటనలో ఇంత మొత్తంలో నగదు పట్టుబడటం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. కొన్ని రోజుల పాటు లెక్కింపు ప్రక్రియ కొనసాగగా, 176 డబ్బు సంచులను బాలంగిర్ ఎస్‌బీఐ బ్రాంచీలో డిపాజిట్ చేసినట్లు చెప్పారు.
ఒడిశా రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు సంబంధమున్న పలు మద్యం కంపెనీలు పన్ను ఎగవేతకు పాల్పడుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. నగదు కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. ఈ కౌంటింగ్ ప్రక్రియలో ముగ్గురు బ్యాంక్ అధికారులు, 50 మంది ఐటీ శాఖ ఆఫీసర్లు పాల్గొన్నారు. 40 కరెన్సీ లెక్కింపు యంత్రాలను ఇందుకోసం వినియోగించారు. తితిలాగఢ్, సంబల్‌పుర్‌లోని దేశీ మద్యం తయారీ యూనిట్ల నుంచి కూడా భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. ఈ డబ్బును రెండు వ్యాన్లలో సంబల్‌పుర్ ఎస్‌బీఐ బ్రాంచ్‌కు తరలించారు.
అల్మారాల్లో నోట్ల గుట్టలు- రూ.220కోట్లు సీజ్- ప్రతి పైసా కక్కిస్తామన్న మోదీ
ఒడిశాలో మరో 20బ్యాగుల నోట్ల కట్టలు సీజ్- మొరాయిస్తున్న క్యాష్ కౌంటింగ్ మెషిన్లు- చేసేదేం లేక!!