ముగ్గురు భార్యల 'రాజకీయం'.. వారి ముద్దుల మొగుడి ఉద్యోగానికే ఎసరు తెచ్చింది. మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాకు చెందిన ఓ గ్రామ పంచాయతీ కార్యదర్శిపై ఎన్నికల అధికారులు చర్యలు మొదలుపెట్టారు. అతడి ముగ్గురు భార్యలు.. ఎన్నికల్లో పోటీ చేయడమే అందుకు కారణం. నిబంధనల ప్రకారం.. అధికారులకు ముగ్గురు భార్యల వివరాలు ఇవ్వాల్సి ఉండగా.. అతడు ఇద్దరి సమాచారం మాత్రమే ఇచ్చాడు. మూడో భార్య గురించి మాత్రం బయటపెట్టలేదు. దీంతో ఎన్నికల అధికారి అది గుర్తించి చర్యలు ప్రారంభించారు.
అసలేం జరిగిందంటే.. మధ్యప్రదేశ్‌లో అతి త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే అందులో పోటీ చేయనున్న ప్రభుత్వ ఉద్యోగుల జీవిత భాగస్వాముల వివరాలను అధికారులు అందించమన్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శి సుఖ్రామ్ సింగ్ ముగ్గురు భార్యలు నామినేషన్లను దాఖలు చేశారు. ముగ్గురూ.. భర్త పేరు దగ్గర సుఖ్రామ్సింగ్ అనే రాశారు. అయితే అతడు మాత్రం అధికారులకు కుసుకలి సింగ్, గీతా సింగ్ వివరాలు మాత్రమే అందించాడు. తన మూడో భార్య అయిన ఊర్మిళా సింగ్ గురించి ఎటువంటి వివరాలు ఇవ్వలేదు. దీంతో అది గుర్తించిన అధికారులు.. అతడిపై క్రమశిక్షణ రాహిత్య చర్యలు చేపట్టారు. సస్పెండ్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
పిపర్ఖండ్ గ్రామ సర్పంచ్ పదవికి సుఖరామ్‌సింగ్ ఇద్దరు భార్యలు(కుసుకలి, గీత) ఒకరిపై ఒకరు పోటీ పడుతుండగా.. మరో భార్య ఊర్మిళ వార్డ్ మెంబర్ పదవి కోసం బరిలోకి దిగింది. అయితే సుఖ్రామ్ సింగ్‌కు ఇదివరకే షోకాజ్ నోటీసులు జారీ చేశామని అధికారులు తెలిపారు. అతడు వాటిపై ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడం వల్లే చర్యలు ప్రారంభించామని చెప్పారు.
ఇవీ చదవండి: భర్తతో నిద్రిస్తున్న మైనర్‌పై గ్యాంగ్‌రేప్.. కత్తితో బెదిరించి..!