మధ్యప్రదేశ్‌లో హృదయ విదారక ఘటన జరిగింది. ఓ 12 ఏళ్ల బాలుడు కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందాడు. స్కూల్ బస్సులో కుప్పకూలిన ఆ విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళితే..
భింద్ ప్రాంతానికి చెందిన మనీశ్ జాటవ్ స్థానిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం మనీశ్ తన సోదరుడితో కలిసి స్కూల్లో భోజనం చేశాడు. ఆ తర్వాత 2 గంటలకు తరగతులు ముగిసిన వెంటనే ఇంటికి తిరిగికెళ్లేందుకు స్కూల్ బస్సు ఎక్కాడు. ఆ వెంటనే అతడు కుప్పకూలాడు.
గమనించిన డ్రైవర్ పాఠశాల యాజమాన్యానికి సమాచారమిచ్చాడు. వారు హుటాహుటిన అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతిచెందాడు. "ఆసుపత్రికి వచ్చేసరికి మనీశ్ ప్రాణాలతో లేడు. సీపీఆర్ చేసినా అతడిని కాపాడలేకపోయాం. ప్రాథమిక లక్షణాలు చూస్తుంటే కార్డియాక్ అరెస్టుకు గురైనట్లు తెలుస్తోంది" అని వైద్యులు వెల్లడించారు. కరోనా తర్వాత ఇలాంటి కేసులు పెరిగినట్లు అధ్యయనాలు చెబుతున్నాయని వైద్యులు తెలిపారు. అయితే ఇంత చిన్న వయసులో కార్డియాక్ అరెస్ట్ రావడం బహుశా మధ్యప్రదేశ్‌లో ఇదే తొలి కేసు అయి ఉంటుందని అన్నారు. అయితే తన కుమారుడికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని మనీశ్ తండ్రి తెలిపారు.