Mother's Day Special 2023 : జాబ్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఆదమరచి నిద్రపోయే చిన్నారి.. తన గారాల పట్టీకి ఆరోగ్యం బాగోలేకపోయినా పక్కన ఉండలేని పరిస్థితి.. ఆఫీస్ వర్క్‌లో పడి పిల్లల పాఠశాల ప్రోగ్రామ్స్‌కు అడెంట్ కాలేకపోవడం.. ఇలాంటివన్నీ అనుకోకుండా జరిగేవే అయినా అమ్మల మనసుపై తెలియని భారం మోపేస్తాయి. ఒక్కో సమయంలో మన పని హడావిడిలో మనం ఉండగా.. పిల్లలేమో 'అమ్మా' కాసేపు ఆడుకుందామా అని ప్రేమగా కోరతారు. పనిలో ఉన్నాను.. ఇప్పుడు కాదులేమ్మా అని సర్దిచెప్పినా కొన్నిసార్లు బెట్టుచేస్తారు. కోపంలో ఓ విసుగో.. బెదిరింపో పెదవి జారితే వాళ్ల కళ్లల్లో సుడులు తిరిగే నీళ్లు.. తెలియకుండానే అమ్మ గుండెకు గాయం చేస్తాయి.
Moms Guilt : పిల్లల బంగారు భవిష్యత్ కోసమే ఆఫీస్- ఇల్లు మధ్య కష్టపడుతున్నా.. చాలా మంది అమ్మలకు ఎదురయ్యే బహుమానాలివి. దీనికి తోడు 'నేను సరైన అమ్మనేనా'? అని మనసులో వేధించే అనుమానం! కన్నపేగుకు ఆరోగ్యం బాగాలేనప్పుడు పక్కన ఉండలేకపోయినా.. పిల్లలు ఖాళీ కడుపుతో పడుకున్నా.. 'తప్పంతా నాదే' అని తనలో తను మదనపడటం.. పిల్లలకు న్యాయం చేయలేకపోతున్నానని బాధపడటం.. దీనినే ప్రపంచ వ్యాప్తంగా 'మామ్స్ గిల్ట్'గా పిలుస్తున్నారు.
కారణాలేంటంటే..? నిజానికి అమ్మ పాత్రలో ఒదిగిపోవడమే కష్టం. పిల్లలు పుట్టిన క్షణం నుంచే వారిని ప్రేమించడం, బిడ్డల సంరక్షణ బాధ్యతగా స్వీకరించడం మన విధిగా భావిస్తాం. ఆ విధుల్లో వేటిని సరిగా నిర్వర్తించలేకపోయినా సరే 'అమ్మ'ను ఈ అపరాధ భావన చుట్టేస్తుంది. బాధ, భయం, కోపం, తికమక.. ఇలా అనేక రూపాల్లో అది బయటపడుతుంటుంది. మనసుపై తీవ్ర ఒత్తిడి పెంచుతుంది. పిల్లలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కంగారు పడటం, తెలియకుండానే ఏడ్చేయడం.. వాళ్లు కోరగానే కష్టమైనా వారికి ఇష్టమైనవి తెచ్చి ఇవ్వడం ఇలాంటివన్నీ దాని నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలే. ఇది అమ్మలకే కాదు.. పిల్లలకూ మంచిది కాదు.
బయటపడేదెలా..? కొందరు తల్లులకు పాలు పడకపోవడం.. పిల్లల కోసం రాజీనామా చేసిన స్నేహితురాలు.. మా మీద నీకు ప్రేమే లేదు' అనే చిన్నారుల కంప్లైంట్.. 'పిల్లల కన్నా ఉద్యోగమెక్కువా' అని తెలిసిన వారు వేసే ప్రశ్న.. చిన్న తనంలో ఎదురైన కొన్ని పరిస్థితులు.. ఇలా ఈ 'మామ్స్ గిల్ట్' ఏర్పడటానికి ఎన్నో కారణాలున్నాయి. వీటిలో మీ సమస్య ఏది..?
కొన్ని ప్రకృతి సంబంధ విషయాలకు ఏమీ చేయలేం కదా! అలాంటప్పుడు దాని గురించి ఆలోచించి ప్రయోజనం ఏముంది? 'సమయం ఇవ్వలేకపోతున్నా'.. ఇదే చాలా మంది తల్లుల్లో ఉన్న బాధ. అయితే అందరి ఆర్థిక పరిస్థితులూ ఒకేలా ఉండవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి, ఉద్యోగం తప్పని సరైతే ఇతరులతో పోల్చుకోవడం అనవసరం. ఇక బయటి వాళ్ల ఒత్తిడంటారా..? మన గురించి 'ఎవరు ఏమనుకుంటారో' అనుకుంటూ బతికినంత కాలం ఏదో రూపంలో ఈ ఒత్తిడి సహజమే. 'పిల్లల కోసమే నా తాపత్రయమంతా' అని మీకు అనిపించినంత వరకూ వేటినీ పట్టించుకోవద్దు.
చివరిగా.. ఈ లోకంలో 'పర్‌ఫెక్ అమ్మ' అంటూ ఎవరూ ఉండరు. అనవసరంగా లేని కిరీటాన్ని ఊహించుకుని కడుపులో కాయ పడ్డప్పటి నుంచే తెలియని ఒత్తిడి, ఆందోళనకు గురవుతుంటాం. ప్రతి అమ్మకీ పిల్లల పెంపకంలో ఒక్కో దశా అమూల్యమే. పక్క వాళ్లతో పోల్చుకోవడం మాని దానిని ఆస్వాదించండి. అమ్మగా మీ ప్రయాణ పుస్తకాన్ని మీకు అనుగుణంగా, అందంగా రాసుకుంటూ సాగిపోండి..!
ఇవీ చూడండి..
Mothers Day Special : అమ్మా నీకు సలాం.. పిల్లల ప్రేమ వదులుకొని.. తల్లి సేవకై తపించి..