Mother Made Daughter Idol : పెళ్లైన తర్వాత పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన ఆ మహిళ.. కొన్నిరోజులకే తన భర్తను కోల్పోయారు. తండ్రి లేని లోటు తెలియకుండా తన కుమార్తెను అల్లారుముద్దుగా పెంచారు. ఎందరో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిన ఆ ఉపాధ్యాయురాలు.. తన కుమార్తెను బీఈ డీగ్రీ చదివించి పెళ్లి చేయాలని కలలు కన్నారు. కానీ వివాహ సంబంధం ఖరారైన కొద్దిరోజులకే ఆమె కుమార్తె క్యాన్సర్తో బాధపడుతూ చనిపోయింది. అయితే చనిపోయిన కుమార్తె కోరికలన్నీ తీర్చిన ఆ మహిళ.. ఆమె విగ్రహాన్ని తయారు చేయించి ఇంట్లోనే పెట్టుకున్నారు. తన కుమార్తె ఇంకా బతికే ఉందనుకుంటూ ఒంటరిగా జీవితం గడుపుతున్నారు కర్ణాటకకు చెందిన ఆ మహిళ.
![Mother Made Daughter Idol](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-12-2023/20276857_eoeo-4.jpg)
దావణగెరె సరస్వతి బరంగయ్లోని నివాసం ఉంటున్న రిటైర్డ్ టీచర్ కమలమ్మ భర్త చాలా ఏళ్ల క్రితం మరణించారు. అప్పటి నుంచి తన కుమార్తె కావ్యకు తండ్రి లేని లోటు తెలియకుండా పెంచారు. బెంగళూరులోని ఓ కళాశాలలో బీఈ డిగ్రీ చదివిన కావ్యకు పెళ్లి సంబంధం చూడడం మొదలుపెట్టారు కమలమ్మ. తెలిసిన వాళ్ల ద్వారా తన కుమార్తెకు సరైన వరుడిని వెతికి పెళ్లి నిశ్చయించారు. కానీ ఇంతలోనే కావ్య తీవ్ర అస్వస్థతకు గురైంది.
![Mother Made Daughter Idol](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-12-2023/20276857_eoeo-2.jpg)
"2019లో కావ్యకు పెళ్లి సంబంధం ఖరారైంది. అదే ఏడాది ఏప్రిల్లో ఘనంగా పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం. ఇంతలోనే ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు స్కానింగ్ చేయించమన్నారు. స్కానింగ్ చేయిస్తే ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లుగా తేలింది"
-- కమలమ్మ, కావ్య తల్లి
క్యాన్సర్ బారిన పడ్డ కావ్యకు బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. నాలుగేళ్లు పాటు చికిత్స అందించారు. కానీ లాభం లేకుండా పోయింది. క్యాన్సర్తో పోరాడుతూ 2022 డిసెంబర్ 10వ తేదీన కావ్య.. తన తల్లి కమలమ్మ ఒడిలోనే మరణించింది. అంతకుముందుకే తన కోరికలన్నీ తల్లికి చెప్పింది కావ్య.
"నా కుమార్తె చనిపోయేముందు కొన్ని కోరికలు కోరింది. తన మృతదేహాన్ని సమాధి చేసిన చోట పూలమొక్కలతో గార్డెన్ నిర్మించమని చెప్పింది. విగ్రహాన్ని తయారు చేయించుకోమని చెప్పింది. తన శరీరంలోని అవయవాలను బెంగళూరు ఆస్పత్రిలో దానం చేయమని కోరింది. కావ్య అవయవాలను దానం చేసేందుకు ప్రయత్నం చేశాం. కానీ క్యాన్సర్తో బాధపడుతూ చనిపోవడం వల్ల సీనియర్ డాక్టర్లెవరూ అందుకు అంగీకరించలేదు. చివరకు నాకు తెలిసిన వారి దగ్గర రూ.1.5 లక్షలకు స్థలాన్ని కొనుగోలు చేసి కావ్య అంత్యక్రియలు పూర్తి చేశాను"
-- కమలమ్మ, కావ్య తల్లి
కావ్య చనిపోయే ముందు కమలమ్మకు ఓ విగ్రహానికి సంబంధించిన వీడియోను మొబైల్లో చూపించింది. తనకు కూడా అలాంటి విగ్రహమే తయారు చేయించమని చెప్పింది. తాను మరణించినా విగ్రహం రూపంలో ఉంటానని కావ్య చెప్పినట్లు కమలమ్మ అంటున్నారు. అయితే కావ్య కోరిక మేరకు ఆమె చనిపోయిన కొద్దిరోజులకే విగ్రహాల తయారుదారుడి కోసం కమలమ్మ వెతికారు. విశ్వనాథ్ అనే కళాకారుడిని ఫోన్లో సంప్రదించారు. మూడున్నర లక్షల రూపాయల వ్యయంతో విశ్వనాథ్.. కావ్య సిలికాన్ విగ్రహాన్ని రూపొందించారు. అప్పటి నుంచి కావ్య విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని కమలమ్మ జీవిస్తున్నారు.
![Mother Made Daughter Idol](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-12-2023/20276857_eoeo-3.jpg)
"నేను బయట నుంచి వచ్చిన ప్రతిసారీ కావ్య నిజంగా ఇంట్లోనే ఉందని భావిస్తుంటాను. తనతో(విగ్రహంతో) అలా మాట్లాడుతూనే ఉంటాను. ఏం వంట చేయాలి? అలాంటి విషయాలన్నీ తనతో మాట్లాడుతుంటాను"
-- కమలమ్మ, కావ్య తల్లి
ఏటా కావ్య పుట్టినరోజున కమలమ్మ.. అనాథ పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతుంటారు. చిన్నప్పటి నుంచి సాహిత్యంపై ఎంతో ఆసక్తి కలిగిన కావ్య అనేక పోటీల్లో పాల్గొని బహుమతులు గెలిచుకుంది. కావ్య మరణించిన తర్వాత ఆమె రాసిన కవితలన్నీ పుస్తక రూపంలో విడుదల చేశారు కమలమ్మ.
![Mother Made Daughter Idol](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-12-2023/20276857_eoeo-5.jpg)
![Mother Made Daughter Idol](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-12-2023/20276857_eoeo-1.jpg)