జైలులో ఉన్న కుమారుడికి డ్రగ్స్ సరఫరా చేసేందుకు ప్రయత్నించింది ఓ తల్లి. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. నిందితురాలు పర్వీన్ తాజ్‌ను పరప్పన అగ్రహార పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె కుమారుడు మహమ్మద్ బిలాల్‌పై 11 దోపిడీ కేసులు నమోదయ్యాయి. అందువల్ల బిలాల్‌ను కోననకుంటె పోలీసులు అరెస్టు చేసి పరప్పన అగ్రహార జైలుకు తరలించారు.
కొడుకును చూసేందుకు పర్వీన్ తరచూ జైలుకు వచ్చేది. అయితే జూన్ 13న పరప్పన అగ్రహార జైలుకు వచ్చిన ఆమె.. ఆ సమయంలో ఓ బాక్సుతోపాటు బట్టల బ్యాగ్‌ను తెచ్చింది. జైలు సిబ్బంది తనిఖీలు నిర్వహించగా ఆ బ్యాగ్‌లో రూ.5 లక్షల విలువైన హాషీష్ ఆయిల్ బయటపడింది. వెంటనే జైలు సిబ్బంది పరప్పన అగ్రహార పోలీసులకు సమాచారం అందించగా.. నిందితురాలు పర్వీన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
'జైల్లో ఉన్న వ్యక్తికి నా కొడుకు బట్టల బ్యాగ్ ఇవ్వాల్సి ఉందని ఎవరో నాకు ఫోన్ చేసి చెప్పారు. అందుకే బ్యాగ్ ఇచ్చేందుకు అంగీకరించాను' అని పోలీసుల విచారణలో నిందితురాలు పర్వీన్ చెప్పింది. బ్యాగ్‌లో ఉన్న డ్రగ్స్ గురించి తనకు తెలియలేదని పోలీసులకు తెలిపింది. నిందితురాలి వాంగ్మూలం, మొబైల్ కాల్స్ ఆధారంగా తదుపరి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: బాలికపై ఏడుగురు సామూహిక అత్యాచారం.. నిందితుల్లో నలుగురు మైనర్లు!