కర్ణాటక రాష్ట్ర ఎన్నికల చరిత్రలో అత్యంత వయోవృద్ధుడైన అభ్యర్థిగా 92 ఏళ్ల శామనూరు శివశంకరప్ప నిలిచారు. మరి ఆయన ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు..? ఇప్పటి వరకు ఎన్నిసార్లు గెలుపొందారో ఓసారి తెలుసుకుందామా మరి.
శామనూరు శివశంకరప్ప.. కాంగ్రెస్ సీనియర్ నేత. దావణగెరె దక్షిణ నియోజకవర్గంలో ఓటమి ఎరుగని నాయకుడు. ఇప్పుడు ఆయన వయసు 92 ఏళ్లు. ఈ వయసులో కూడా ఆయన ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఓటమి ఎరుగని నేతగా ఆయనకు పేరుంది. ఆయన ఈ వయసులోనూ ఎంతో ఉత్సాహాంగా ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు.
వీళ్ల ఓట్లే కీలకం..!
వీరశైవ లింగాయత్ మహాసభ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న శివశంకరప్ప వచ్చే నెల జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిపై నాలుగోసారి పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. దావణగెరె దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 83 వేల ముస్లిం ఓట్లు ఉన్నాయి. వీరే అభ్యర్థుల గెలుపోటముల్లో కీలక పాత్ర పోషిస్తారు. 2008లో ఈ నియోజకవర్గాన్ని దావణగెరె దక్షిణగా విభజించిన తర్వాత శామనూరు శివశంకరప్ప నిర్విరామంగా గెలుస్తూ వస్తున్నారు.
శామనూరు శివశంకరప్ప రాజకీయ చరిత్ర..!
- 1994- రాజకీయాల్లోకి అరంగేట్రం
- 1994- దావణగెరె మునిసిపల్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నిక
- 1994- దావణగెరె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక
- 1997- లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు
- 1999- లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేసి ఓటమి
- 2004- దావణగెరె ఎమ్మెల్యేగా మరోసారి గెలుపు
- 2008, 2013, 2018 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు దావణగెరె దక్షిణ ఎమ్మెల్యేగా విజయం
దావణగెరె దక్షిణ నియోజకవర్గం శామనూరు శివశంకరప్ప వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2008లో దావణగెరె నియోజకవర్గాన్ని దావణగెరె దక్షిణగా విడదీశారు. మొత్తంగా దావణగెరె నగరం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం విశేషం. ఇలా వరుస విజయాలతో దావణగెరె దక్షిణ ప్రజలపై మరోసారి విశ్వాసం వ్యక్తం చేసిన శివశంకరప్ప 'నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు నాపై ఉన్నాయి. నా వయసు 90 ఏళ్లు దాటినప్పటికీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. ఈసారి కూడా మళ్లీ నేనే గెలిచి చరిత్ర సృష్టిస్తా' అని అన్నారు. 'మా నాన్న ఈ వయసులో కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూడా ఆయనే గెలిచి మరోసారి రాష్ట్రంలో చరిత్ర సృష్టిస్తారు' శివశంకరప్ప కుమారుడు ఎస్.ఎస్.మల్లికార్జున్ అభిప్రాయపడ్డారు.
మరోవైపు బీజేపీ తరఫున ఎన్నికల బరిలో నిలబడ్డ అభ్యర్థి బీజీ అజయ్‌కుమార్‌కు ఈ నియోజకవర్గంలోని ముస్లిం ఓటర్లతో మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే మైనారిటీ కాలనీల్లో పలు అభివృద్ధి పనులు జరగటానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఇదిలా ఉంటే శామనూరు శివశంకరప్పకు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో విజయకుమార్‌ను బరిలోకి దింపిన కమలం పార్టీ వ్యూహం ఫలిస్తుందా లేదా అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.