ATTACK ON SP BAGHEL: ఉత్తర్‌ప్రదేశ్‌లో కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ బఘేల్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. మైనపురి జిల్లా అత్తికుల్లాపుర్ గ్రామంలో మంగళవారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
"ఎన్నికల ప్రచారం కోసం అత్తికుల్లాపుర్ నుంచి కర్హాల్ వెళ్తుండగా.. మార్గమధ్యలో కొందరు దుండగులు రాళ్లు, కర్రలతో కాన్వాయ్‌పై దాడి చేశారు. వారిలో కొంతమంది 'అఖిలేశ్ భయ్యా జిందాబాద్' అని నినాదాలు చేశారు. మీరు మా నాయకుడిపై పోటీ చేస్తున్నారు..అందుకే మిమ్నల్ని వదిలిపెట్టమని బెదిరించారు. కాన్వాయ్ నుంచి సెక్యూరిటీ గార్డు దిగిన వెంటనే దుండగులు పరారయ్యారు."
- కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్
UP ELECTIONS 2022: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్యపాల్ బఘేల్.. కర్హాల్ నియోజకవర్గం నుంచి భాజపా తరపున బరిలో దిగారు. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా అఖిలేష్ యాదవ్ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
సమాజ్‌వాదీ నాయకులే..
ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందించారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకులే దాడి చేశారని ఆయన ఆరోపించారు. తమ పార్టీ నిజ స్వరూపాన్ని చూపించారని ట్వీట్ చేశారు. భాజపా ఎంపీ గీతపై సోమవారం దాడి జరిగిందని మౌర్య తెలిపారు. ఈ రెండు ఘటనలకు సంబంధించిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఓటమి భయంతోనే అఖిలేశ్ యాదవ్ ఇలాంటి పనులు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయం ప్రజల మీద ఆధారపడి ఉంటుంది..
ఎస్పీ బఘేల్ ఘటనపై భాజపా యూపీ అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్ స్పందించారు. ఈ ఘటన అఖిలేశ్ యాదవ్ ఓటమిని తెలియజేస్తోందని అన్నారు. ఎన్నికల్లో విజయం ప్రజల ఆశీర్వాదం మీదే ఆధారపడి ఉంటుందని, బలం మీద కాదని ఆయన ట్వీట్ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10న ప్రారంభమయ్యాయి. మొదటి రెండు దశల పోలింగ్ పూర్తయ్యింది. కర్హాల్ నియోజకవర్గంలో ఫిబ్రవరి 20న మూడో దశలో ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చదవండి: 'ఈశాన్య దిల్లీ అల్లర్లపై పోలీసుల దర్యాప్తు భేష్'