దిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. ఆస్పత్రుల్లోని పడకలను కరోనా రోగులకు రిజర్వు చేస్తూ దిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేసుల పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని పలు ఆస్పత్రుల్లోని సాధారణ, ఐసీయూ పడకలను వైరస్ బాధితులకు కేటాయించమని ఆదేశించినట్లు సీఎం కేజ్రీవాల్ ట్విట్టర్‌లో తెలిపారు. దిల్లీలో కేసుల పెరుగుదలను నిశితంగా పరిశీలిస్తున్నామన్న ఆయన.. వైరస్ కట్టడికి అన్ని రకాల చర్యలను చేపడుతున్నట్లు చెప్పారు. కేసుల పెరుగుదలపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. ప్రతి ఒక్కరూ వైరస్ కట్టడికి జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
5 రోజుల్లో 18500 మందికి ఫైన్!
దేశ రాజధాని నగరంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోవడం వల్ల దిల్లీ ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. వైరస్ కట్టడే లక్ష్యంగా కొవిడ్ నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధిస్తోంది. ఇందులో భాగంగా గత ఐదు రోజుల వ్యవధిలో 18500 మంది నుంచి జరిమానా రూపంలో రూ.3.18 కోట్లు వసూలైనట్టు అధికారులు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిలో నార్త్ దిల్లీలో అత్యధిక మంది ఉండగా.. ఈస్ట్ దిల్లీలో అత్యల్పంగా ఉన్నట్టు తెలిపారు. ప్రజలు గుమిగూడకుండా హోలీ, షాబ్‌ఈ బరత్ వంటి వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి : 12మంది సిమి సభ్యులకు జీవితఖైదు