కర్ణాటకలో నైతిక పోలీసింగ్ కలకలం రేపింది. విహారయాత్రలో భాగంగా స్నేహితురాళ్లతో కలిసి బీచ్‌కు వచ్చిన విద్యార్థులపై.. స్థానిక యువకులు దాడి చేశారు. మరో మతానికి చెందిన వారన్న కారణంతో దాడికి దిగారు. బాధితులంతా కేరళకు చెందినవారు కాగా.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన ముగ్గురు విద్యార్థులు, మరో ముగ్గురు విద్యార్థినులతో కలిసి.. విహారయాత్ర కోసం కర్ణాటకకు వచ్చారు. గురువారం సాయత్రం.. మంగళూరులోని ఉల్లా బీచ్‌కు వీరంతా వెళ్లారు. అదే సమయంలో అక్కడే ఉన్న కొందరు యువకులు.. ఆ విద్యార్థులను గమనించారు. అందులోని యువకులు వేరే కమ్యూనిటీకి చెందిన వారని తెలుసుకొని.. విద్యార్థులను వివిధ ప్రశ్నలు అడిగారు. అనంతరం ముగ్గురు విద్యార్థులపై దాడికి తెగబడ్డారు. దీంతో గాయలపాలయైన ఆ ముగ్గురు విద్యార్థులు.. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. మిగతా ముగ్గురు విద్యార్థినులు వారి సొంతూరికి వెళ్లిపోయారు. సోమేశ్వర్ సముద్ర తీరం వద్ద ఈ దాడి జరిగింది.
ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కఠిన భద్రత చర్యలు చేపట్టారు. అనంతరం బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని కఠిన చర్యలు చేపడతామని పోలీసులు పేర్కొన్నారు. నిందితులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. కాగా ఘటనతో సంబంధమున్న ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
మతం మారాలంటూ ఒత్తిడి.. మైనర్ ఆత్మహత్య
తన మతాన్ని దాచిపెట్టి వేరే కమ్యూనిటీకి చెందిన బాలికను పెళ్లి చేసుకున్నాడు ఓ బాలుడు. అనంతరం ఆమెను తమ మతంలోకి మారాలంటూ తీవ్ర వేధింపులకు గురిచేశాడు. ఈ మధ్యనే ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఆ బాలిక.. ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపులు భరించలేక తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఈ ఘటన జరిగింది.
'బాలుడిపై కేసు నమోదు చేశాం. రెండేళ్ల క్రితం బాలుడు.. బాధిత బాలికను ఓ కొండపై పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలో తన మతం గురించి ఎలాంటి వివరాలను ఆమెకు వెల్లడించలేదు. వివాహం అనంతరం ఆ బాలుడు.. నిరంతరం వేధించేవాడు. తమ మతంలోకి మారాలంటూ ఒత్తిడి చేసేవాడు' అని పోలీసులు వెల్లడించారు.
మృతురాలి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్షల కోసం రాంచీలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. శవపరీక్ష నివేదిక తరువాతే ఆమె చనిపోవడానికి గల కారణాలు తెలుస్తాయని వెల్లడించారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని తెలిపిన పోలీసులు.. నిందుతుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం కోర్టులో హాజరు పరిచామని.. నిందితుడు మైనర్ కావడం వల్ల జువైనల్ హోమ్‌కు తరలించామని పేర్కొన్నారు.