Monsoon in Kerala : భారత వాతావరణ విభాగం శుభవార్త చెప్పింది. మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని ప్రకటించింది. తర్వాత క్రమంగా అన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది. లక్షద్వీప్ సహా దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు చేరుకునేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. నైరుతి, ఈశాన్య, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల మీదుగా రుతుపవనాలు ఆవహిస్తాయని పేర్కొంది.
ఏప్రిల్ నుంచి మే మొదటి వారం వరకు ఎండలు పెద్దగా లేకపోయినా తర్వాత క్రమంగా ఎండల తీవ్రత పెరిగింది. మే చివరి వారం నుంచి ఇప్పటివరకు నిత్యం 40 డిగ్రీలకుపైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫలితంగా పగటి వేళల్లో ప్రజలు ఇళ్ల నుంచి అడుగు బయట పెట్టాలంటేనే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తొలకరి పలకరించనుందంటూ ఐఎండీ తీపి కబురు చెప్పింది.
నైరుతి రుతుపవనాలు సాధారణంగా ఏడు రోజులు అటూఇటుగా జూన్ 1న కేరళ తీరాన్ని తాకుతాయి. జూన్ 4న రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని మే నెలలో ఐఎండీ అంచనా వేసింది. కానీ, ప్రస్తుత పరిస్థితుల ప్రకారం రుతుపవనాలు మరింత ఆలస్యం అయినట్లు స్పష్టమవుతోంది. వర్షాధార పంటలకు నైరుతి రుతుపవనాలు కీలకం. నైరుతి రుతుపవనాల వర్షాలు ప్రారంభయ్యాక ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. వర్షాలు ప్రారంభం కాగానే.. రైతులు నాట్లు వేస్తుంటారు. రుతుపవనాలు ఆలస్యమైతే పంటల సీజన్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది.
వర్షాలపై తుపాను ఎఫెక్ట్
మరోవైపు, ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడ్డ బిపర్జాయ్ తుపాను.. వేగంగా తీవ్ర తుపానుగా మారిందని ఐఎండీ తెలిపింది. కేరళలో రుతుపవనాలపై దీని ప్రభావం ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భారత ద్వీపకల్పానికి రుతుపవనాలు విస్తరించడం కూడా ఆలస్యం కావొచ్చని అంటున్నారు. తుపాను ప్రభావంతో వర్షాలు పడినా.. రుతుపవనాల విస్తరణ ఆలస్యం కావొచ్చని చెబుతున్నారు. జూన్ 12 నాటికి తుపాను బలహీనపడే అవకాశాలు ఉన్నాయని.. అప్పటివరకు రుతుపవనాలు నెమ్మదిగా కదులుతాయని 'స్కైమెట్ వెదర్' ఉపాధ్యక్షుడు మహేశ్ పాలావత్ పేర్కొన్నారు.
'తూర్పు మధ్య, ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడ్డ తుపాను గంటకు 2 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపు పయనిస్తోంది. తీవ్ర తుపానుగా మారిన ఈ తుపాను.. గోవాకు పశ్చిమ-నైరుతి దిక్కున 890 కిలోమీటర్ల దూరంలో, ముంబయికి నైరుతి వైపు వెయ్యి కిలోమీటర్ల దూరంలో కేంద్రీకరించి ఉంది. ఈ తుపాను ఉత్తరం దిశలో ప్రయాణించి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. మూడు రోజుల తర్వాత ఉత్తర-వాయువ్య దిశగా కదులుతుంద'ని ఐఎండీ స్పష్టం చేసింది. అయితే, ఈ ప్రభావం.. తుపాను ప్రయాణించే దిక్కులో ఉన్న ఒమన్, ఇరాన్, పాకిస్థాన్ దేశాలపై ఎలా ఉంటుందనేది ఐఎండీ వెల్లడించలేదు. కాగా, అరేబియా సముద్రంలో ఈ ఏడాది ఏర్పడ్డ తొలి తుపాను ఇదే.