Monkey Land: భూమి అనగానే వ్యక్తుల పేరునో లేక సంస్థల పేరునో ఉండడం మనకు తెలుసు. అలాంటిది మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో వానరాలకు వాటి పేరున ఏకంగా 32 ఎకరాల భూమి ఉంది. జిల్లాలోని ఉప్లా గ్రామంలో ప్రజలు వానరాలను అత్యంత ప్రేమగా చూసుకుంటారు. అవి ఎప్పుడు ఇంటికి వచ్చినా.. వాటికి ఆహారం అందిస్తారు. అంతేకాకుండా వివాహాల సమయంలోనూ వాటిని గౌరవిస్తారు. ఇటీవల గ్రామ పంచాయతీలోని రికార్డులను పరిశీలించగా 32 ఎకరాల భూమి గ్రామంలో నివసించే వానరాల పేరు మీద ఉంది.
ఈ విషయమై సర్పంచి బప్పా పడ్వాల్ మాట్లాడుతూ.. "భూమి కోతులదేనని పత్రాలు విస్పష్టంగా పేర్కొంటున్నాయి. అయితే ఎవరు వీటిని సృష్టించారో తెలియదు. ఈ పత్రాలను ఎప్పుడు రాశారో తెలియదు" అని తెలిపారు. గ్రామంలో జరిగే అన్ని కార్యక్రమాల్లోనూ కోతులు భాగంగా ఉండేవని వివరించారు. గతంలో గ్రామంలో వంద వరకు కోతులు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య బాగా తగ్గిపోయిందని చెప్పారు. ఈ 32 ఎకరాల్లో అటవీశాఖ మొక్కలు నాటిందని, అక్కడ పాడుబడిన ఇల్లు ఉండేదని వెల్లడించారు. ప్రస్తుతం ఆ ఇల్లు కూలిపోయిందని చెప్పారు. గతంలో గ్రామంలో వివాహాలు జరిగేటప్పుడు తొలుత వానరాలకు బహుమతులు అందించేవారని, ఆ తర్వాతే పెళ్లి పనులు చేసేవారని సర్పంచ్ తెలిపారు.
ఇవీ చదవండి: రెండున్నర కేజీల పాము విషం.. ఫ్రాన్స్ నుంచి చైనాకు స్మగ్లింగ్.. విలువ రూ.30 కోట్లు
దొంగ అనుకొని మూకదాడి.. అక్కడికక్కడే వ్యక్తి మృతి.. కానిస్టేబుల్ ఆత్మహత్య