ఒడిశాలో నాలుగేళ్ల కిందట పంపిన మనీ ఆర్డర్ ఇప్పటికి గమ్య స్థానానికి చేరింది. రవుర్కెలా నగరంలో ప్రమోద్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ప్రమోద్ సోదరి సుమిత్రకు వివాహమై, తన కుటుంబంతో టెన్సాలో నివసిస్తోంది. ప్రమోద్ తన సోదరికి, సావిత్రి వ్రతం నిమిత్తం రూ.500ను పోస్టల్ మనీ ఆర్డర్ ద్వారా పంపించాడు. అయితే ఆయన పంపించిన నగదు తన చెల్లెలి దగ్గరకు చేరిందనే అనుకున్నాడు. చెల్లెలు కూడా ఏదో సమస్య కారణంగా అన్నయ్య డబ్బులు పంపించలేదేమో అనుకుంది.
అనూహ్యంగా.. నాలుగేళ్ల క్రితం చేసిన మనీ ఆర్డర్.. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రమోద్ సోదరికి ఈ ఏడాది నవంబరు 26న చేరింది. 2018లో పంపిన మనీ ఆర్డర్ 2022లో చేరటానికి కారణాలేంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ విషయంపై బాధితుడు ప్రమోద్, అతడి తరపు న్యాయవాది మాట్లాడుతూ.. "ఈ వ్యవహారంపై పోస్టల్ ఎస్పీ స్పందన కోసం ఆయనకు కలవడానికి ప్రయత్నంచాం. అయితే ఏదో కార్యక్రమానికి హాజరయ్యేందుకు సంబల్పుర్ వెళ్లారు. దీంతో ఆయనను ఫోన్ ద్వారా సంప్రదించాం. ఈ విషయమై ఎవరూ ఇంతవరకు ఫిర్యాదు చేయని కారణంగా చర్యలు తీసుకోలేదని తెలిపారు. మీడియా నుంచి వచ్చిన వార్తల ఆధారంగా, ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశామని పోస్టల్ ఎస్పీ అన్నారు" అని తెలిపారు.