బంగాల్లోని కోడల్కట్టి గ్రామానికి చెందిన మహ్మద్ నూర్ నబీబుల్ ఇస్లాం అనే యువకుడు తాను నివసించే గ్రామ ప్రజల కోసం ఎవరూ చేయని ఆలోచన చేశాడు. ఊర్లో ఉన్న నదిపై వంతెన నిర్మాణం కోసం ఏకంగా 250 కిలోమీటర్లు నడిచాడు. చివరగా కోల్‌కతాలోని ఉత్తరకన్యగా పిలిచే బంగాల్ సెక్రటేరియట్ భవనానికి చేరుకున్నాడు. జల్పాయ్గుడి జిల్లాలోని క్రాంతి, మల్బజార్ ప్రాంతాల మధ్య ఉన్న చెల్ నదిపై వంతెన నిర్మించాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారికి ఆదివారం వినతిపత్రాన్ని అందించాడు.
బ్రిడ్జి లేక అడవి నుంచి..
ఈ నదిపై వంతెన లేకపోవడం వల్ల క్రాంతి బ్లాక్‌లోని పలు గ్రామాల ప్రజలు మల్బజార్కు వెళ్లేందుకు అడవి గుండా భయపడుతూ ప్రయాణించాల్సిన దుస్థితి. ఈ ప్రయాణాలు కొన్నిసార్లు చాలా ప్రమాదకరంగా ఉంటాయని గ్రామస్థులు అంటున్నారు. ముఖ్యంగా నదిపై వంతెన సౌకర్యం లేకపోవడం వల్ల గర్భిణులు, వృద్ధులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే మల్బజార్లో అనేక పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులున్నాయి. కానీ, వీటన్నింటికి కలిపి మొత్తంగా ఒకే ఒక్క అగ్నిమాపక కేంద్రం ఉంది. ఫలితంగా ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకోవడం పెద్ద సమస్యగా మారింది.
ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా..
గ్రామస్థులతో కలిసి నూర్ అనేక సార్లు చెల్ నదిపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఉన్నతాధికారులను సంప్రదించాడు. అయినా బ్రిడ్జి నిర్మాణం గురించి మాత్రం ఏ అధికారి పట్టించుకోలేదు. ఈ క్రమంలో మే 23 మంగళవారం ఉదయం నూర్ నబీబుల్.. క్రాంతి ప్రాంతం నుంచి జాతీయ జెండాను చేత పట్టుకుని వంతెన నిర్మాణం చేపట్టాలంటూ పాదయాత్రను మొదలుపెట్టాడు. ముందుగా అతడు మల్బజార్కు వెళ్లి అక్కడ అంబులెన్స్ దాదాగా పిలిచే పద్మశ్రీ అవార్డు గ్రహీత కరీముల్ హక్‌ను కలిశాడు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర అతనితో కలిసి నడక సాగించాడు.
అక్కడి నుంచి రంగమతి ప్రాంతానికి వెళ్లి రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి బులు చిక్ బరాక్‌ను కలిసేందుకు ప్రయత్నించాడు. అక్కడ మంత్రి అందుబాటులో లేకపోవడం వల్ల నూర్ వంతెన డిమాండ్ సహా మరికొన్ని డిమాండ్లకు సంబంధించి ఓ లేఖను కార్యాలయంలో ఉన్న సిబ్బందికి అందజేశాడు. అనంతరం బనర్‌హాట్‌కు వెళ్లి కేంద్ర మైనారిటీ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి జాన్ బార్లాను కలిసి తమ ఊరి ప్రజల డిమాండ్‌లను వినిపించాడు. ఆ తర్వాత కూచ్ బెహార్‌లోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రమాణిక్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయన కూడా అందుబాటులో లేకపోవడం వల్ల కార్యాలయ అధికారికి ఆ లేఖను సమర్పించాడు.
అక్కడి నుంచి నూర్.. జల్పాయ్గుడి చేరుకున్నాడు. అక్కడ బీజేపీ ఎంపీ జయంత్ రాయ్‌ను సంప్రదించగా ఆయన స్పందించలేదు. ఇక చివరగా జల్పాయ్గుడి నుంచి నేరుగా ఉత్తరకన్యకు బయలుదేరాడు. ఇలా శనివారం రాత్రి సిలిగుడి సమీపంలోని ఉత్తరకన్యకు చేరుకుంది నూర్ పాదయాత్ర. రాత్రి సమయం, తర్వాతి రోజు ఆదివారం కావడం వల్ల కార్యాలయంలో ఎవరూ లేనందున సోమవారం నూర్ సచివాలయ అధికారులకు తమ డిమాండ్లకు సంబంధించి లేఖను అందించాడు.
ఎంతమంది అధికారులను కలిసినా ఫలితం దొరకడం లేదంటూ వాపోయాడు నూర్. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రమే తమ డిమాండ్లను నెరవేర్చగలరంటూ ఈ వినూత్న నిరసన యాత్ర చేపట్టినట్టు నూర్ ఈటీవి భారత్‌తో చెప్పాడు. ఈ డిమాండ్ తనొక్కడిదే కాదని.. దశాబ్దాలుగా నెరవేరకుండా ఉన్న క్రాంతి ప్రజలందరిదని అన్నాడు. కాగా, 250 కిలోమీటర్ల నడక ప్రయాణంలో నూర్ కొన్నిసార్లు తన శ్రేయోభిలాషుల ఇంట్లో ఆశ్రయం పొందేవాడు.