భారత్-చైనా మధ్య లద్ధాఖ్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్-చైనా దేశాధినేతలు తొలిసారి ఆన్‌లైన్ ద్వారా ముఖాముఖీ చర్చల్లో పాల్గొనే అవకాశాలు కన్పిస్తున్నాయి. నవంబరు 10న జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీవో) వార్షిక సదస్సులో భారత బృందానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వం వహించనున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ సదస్సులో మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఆన్‌లైన్ ద్వారా ముఖాముఖీ చర్చలో పాల్గొనే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించే ఈ సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అధ్యక్షత వహించనున్నారు. చైనా ప్రతినిధుల బృందానికి జిన్‌పింగ్ నేతృత్వం వహిస్తున్నారు.
భారత్-చైనా మధ్య లద్ధాఖ్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. సరిహద్దు ఘర్షణలతో గత ఆరు నెలలుగా రెండు దేశాల నడుమ ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ విషయమై ఇప్పటికే రెండు దేశాలు పలుమార్లు దౌత్య, సైనిక పరమైన చర్చలు జరిపాయి. అయినప్పటికీ పరిష్కారం లభించలేదు. ఈ నేపథ్యంలో మోదీ, జిన్‌పింగ్ తొలిసారి ముఖాముఖీలో తలపడే అవకాశం రావటం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు ఈ నెల 17న జరిగే బ్రిక్స్ సమావేశంలో, నవంబరు 22న జరిగే జీ20 సదస్సులోనూ మోదీ, జిన్‌పింగ్ వర్చువల్‌గా కలుసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.