Venkaiah Naidu Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అన్ని పక్షాల రాజకీయ నాయకులను తరచుగా భేటీ అవ్వాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అలా చేస్తేనే ప్రతిపక్ష పార్టీలు.. ఆయన విధానాలపై ఉన్న అపార్థాలను తొలగించుకునేందుకు సహాయపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ ప్రసంగాల్లో ఎంపిక చేసిన కొన్నింటిని 'సబ్ కా సాత్..సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్' పేరుతో రూపొందించిన పుస్తకాన్ని ఆయన శుక్రవారం దిల్లీలో విడుదల చేశారు.
ఆరోగ్య సంరక్షణ, విదేశాంగ విధానం, సాంకేతికత వంటి విభిన్న రంగాలలో భారత్ సాధించిన విజయాల పట్ల ప్రధాని మోదీని వెంకయ్య ప్రశంసించారు. భారత్ ఎదుగుదలను ప్రపంచం ఇప్పుడు గుర్తిస్తుందని అన్నారు. మోదీ నూతన సంస్కరణలు చేపట్టారని.. ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చారని వెంకయ్య కొనియాడారు. అదే సమయంలో, రాజకీయ పార్టీలు కూడా విశాల దృక్పథంతో ఉండాలని, అధికారంలో ఉన్నవారికి మీరు శత్రువులు కాదని కేవలం ప్రత్యర్థులేనని చెప్పారు. అన్ని పార్టీలు పరస్పరం గౌరవించుకోవాలని హితవు పలికారు.
భారత్ ఇప్పుడు గుర్తింపు పొందిన శక్తిగా మారిందని, ఇప్పుడా ప్రపంచమంతా ఆ పేరు వినిపిస్తోందన్నారు. దీనికంతటికి ప్రధాని మోదీ పనితీరు, ప్రజలకు ఆయన చేస్తున్న మార్గదర్శనం, భారత్ సాధిస్తున్న ప్రగతే కారణమన్నారు. ప్రధాని మోదీ ఇన్ని విజయాలు సాధించినప్పటికీ.. ఆయన విధానాలపై ఇంకా కొన్నివర్గాలకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని, అవి రాజకీయ అనివార్యత వల్ల కావచ్చని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. కొంతకాలం తర్వాత ఈ అపార్థాలు తొలగిపోతాయన్నారు.
ఈ కార్యక్రమంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం మహిళల శ్రేయస్సు కోసమే మోదీ.. త్రిపుల్ తలాక్ నిషేధ చట్టాన్ని తీసుకొచ్చారని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అన్నారు. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కూడా ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చట్టాలు చేయలేకపోయారని, మోదీ మాత్రం ధైర్యం చేసి ఈ నిర్ణయం తీసుకున్నారని కితాబిచ్చారు.
ఇవీ చదవండి: 'అర్బన్ నక్సల్స్'పై మోదీ ఫైర్.. కోర్టులనూ ప్రభావితం చేస్తున్నారంటూ..
'కూటములు మార్చుతూ నీతీశ్ ప్రధాని కాగలరా? 2025లో బిహార్ మాదే!'