Birbhum Violence: 'బంగాల్ బీర్భుమ్ జిల్లా రాంపుర్హట్ ప్రాంతంలో జరిగిన హత్యాకాండ' అతిక్రూరమైన ఘటనగా అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోదీ. దర్యాప్తునకు అవసరమైతే సాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. కోల్‌కతాలో విక్టోరియా మెమోరియల్‌లో గ్యాలరీ ప్రారంభోత్సానికి వర్చువల్‌గా హాజరైన మోదీ.. ఈ వ్యాఖ్యలు చేశారు.
"ఈ దారుణానికి పాల్పడిన వారిని శిక్షించేందుకు బంగాల్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాను. ఇటువంటి ఘటనలకు పాల్పడిన వారిని అసలు క్షమించకూడదని బంగాల్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. నిందితులు పట్టుబడేందుకు కేంద్రం అన్ని విధాల సహకరించేందుకు సిద్ధంగా ఉంది."
-నరేంద్ర మోదీ, ప్రధాని
కఠిన చర్యలు తీసుకుంటాం: రాంపుర్హట్ ప్రాంతంలో సీఎం మమతా బెనర్జీ గురువారం పర్యటించనున్నారు. బోగ్తుయ్ గ్రామంలో జరిగిన ఈ దారుణంపై మమత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది భాజపా, లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న కుట్ర అని పేర్కొన్నారు. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
"నిజానికి నేను ఈ రోజు పర్యటించాల్సి ఉంది. కానీ పలు రాజకీయ పార్టీలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. వారు తిరిగివచ్చేందుకు కాస్త సమయం పడుతుంది. వారు ఉండగా నేను అక్కడ పర్యటించను. నాకు గొడవపడాలని లేదు. అందుకే రేపు పర్యటిస్తాను. పెట్రోల్ ధరలు పెంపు నుంచి దృష్టి మరల్చేందుకు ఈ ఘటనపై వార్తలు ఇవ్వాలని మీడియాను భాజపా కోరింది."
-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
సీఎం రాజీనామా చేయాలి: హింస చేలరేగిన ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించిన భాజపా వర్గాలను పోలీసులు అడ్డుకున్నారు. సువేందు అధికారి ఆధ్వర్యంలోని ఈ బృందానికి ఘటనాస్థలం వద్దకు చేరుకునేందుకు అనుమతించలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సువేందు.. సీఎం మమత తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నేరస్థులకు రక్షణ కల్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు.
"మమల్ని ఘటనాస్థలం వద్దకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. కానీ ముఖ్యమంత్రిగారు అక్కడ పర్యటిస్తానని చెప్పారు. ఘటనాస్థలంలో ఉన్న సాక్ష్యాధారాలను తొలగించి నేరస్థులను కాపాడేందుకే ఆమె అక్కడికి వెళ్తున్నారు. మేము దీనిని వ్యతిరేకిస్తున్నాము. మమ్మల్ని రానివ్వకపోతే.. ఇంకెవరినీ ఘటనాస్థలం వద్దకు అనుమతించకూడదు. కేవలం సీబీఐ, ఎన్ఐఏలు చేసిన దర్యాప్తులే నిజాన్ని బయటపెట్టగలవు."
-సువేందు అధికారి, భాజపా నేత
రాంపుర్హట్ ప్రాంతంలో మంగళవారం.. కొందరు దుండగులు ఇళ్లకు నిప్పుపెట్టగా ఇద్దరు చిన్నారులు సహా 8 మంది సజీవదహనం అయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. "తృణమూల్ కాంగ్రెస్ నేత, బర్షాల్ గ్రామ పంచాయతీ డిప్యూటీ చీఫ్ బహదూర్ షేక్‌ను సోమవారం ఎవరో హత్యచేశారు. దీంతో రెచ్చిపోయిన ఆయన అనుచరులు.. రాంపుర్హట్లోని 5 ఇళ్లకు నిప్పుపెట్టారు. ఈ క్రమంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు" అని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి : మెడికోపై ఐదుగురు.. దళిత యువతిపై 8మంది గ్యాంగ్ రేప్.. రంగంలోకి సీఎం