కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకున్నారు. నేరపూరిత పరువునష్టం కేసులో సూరత్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాహుల్.. మంగళవారం గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసును అత్యవసరంగా విచారణ చేపట్టాలని రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది పీఎస్ చంపానేరి బుధవారం హైకోర్టును కోరారు. ఇందుకు గుజరాత్ హైకోర్టు అంగీకరించింది. దీంతో ఈ పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ గీతా గోపీ.. తాను ఈ కేసును విచారించబోనని స్పష్టం చేశారు. అయితే, ఈ పిటిషన్‌పై బుధవారం అత్యవసర విచారణకు కోరవచ్చని హైకోర్టు తనకు అనుమతి ఇచ్చిందని.. కానీ విచారణకు కోరగా న్యాయమూర్తి తప్పుకున్నట్లు చెప్పారని చంపానేరి వెల్లడించారు. క్రిమినల్ రివ్యూ పిటిషన్లపై జస్టిస్ గీతా బెంచ్ విచారిస్తున్నందునే.. ఆమె వద్దకు వెళ్లామని ఆయన వివరించారు.
మరోవైపు మంగళవారమే సూరత్ సెషన్స్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు రాహుల్ గాంధీ. అంతకుముందు ఈ కేసుపై విచారణ జరిపిన సూరత్ కోర్టు.. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే ఈ తీర్పును పై కోర్టులో సవాల్ చేసేందుకు వీలుగా 30 రోజుల గడువు ఇచ్చింది. అప్పటి వరకు బెయిల్ కూడా మంజూరు చేసింది. ఈ కేసులో తనపై విధించిన శిక్షపై స్టే విధించాలని కోరుతూ రాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌ను సూరత్ సెషన్స్ కోర్టు ఏప్రిల్ 20న తిరస్కరించింది.
ఇదీ కేసు..
2019లో కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. మోదీ ఇంటిపేరుపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తప్పుపడుతూ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ గుజరాత్‌లోని సూరత్‌లో పరువునష్టం దావా దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సూరత్ కోర్టు.. రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వెలువడిన 24 గంటల్లోపే ప్రజా ప్రాతినిధ్య చట్టం నిబంధనల మేరకు లోక్‌సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేసింది. దీంతో ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయారు. అంతే కాకుండా ఈ వేటు కారణంగా ప్రజాప్రతినిధులకు కేటాయించే అధికారిక భవనాన్ని కూడా ఖాళీ చేయాలని రాహుల్‌కు నోటీసులు పంపించారు అధికారులు. దీంతో ఇటీవలే ఆయన తన ఇంటిని ఖాళీ తల్లి సోనియా గాంధీ నివాసానికి మారారు.
ఇవీ చదవండి : గన్‌తో క్లాస్‌లో హల్చల్.. 80 మంది విద్యార్థులు హడల్.. చివరకు..
సీఎం, ప్రతిపక్ష నేత ఆత్మీయ కలయిక.. ఎయిర్‌పోర్ట్‌లో భుజాలు తట్టుకుంటూ..