రాజస్థాన్‌లోని 16 జిల్లాల్లో 12గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ వార్త విని.. 'అక్కడ అల్లర్లు, హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయేమో!' అనుకుంటే.. పొరబడినట్టే. ఇదంతా ఓ 'పరీక్ష' కోసం(rajasthan exam news today).
ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా రీట్(రాజస్థాన్ ఎలిజిబిలిటీ ఎగ్జామ్ ఫర్ టీచర్స్)(reet exam news) పరీక్ష జరిగింది. ఈ పరీక్ష ద్వారా ప్రభుత్వ పాఠశాలల కోసం ఉపాధ్యాయులను ఎంపిక చేస్తారు. మొత్తం 31వేల పోస్టులు ఉండగా దాదాపు 16లక్షల మంది పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ సమయంలో అభ్యర్థులు 'చీటింగ్'కు పాల్పడకుండా ఉండేందుకు ఇంటర్నెట్ను కట్ చేయాలని ఆదేశించారు అధికారులు.
అధికారుల ప్రకటనతో రాష్ట్ర రాజధాని జైపుర్, ఉదయ్‌పుర్, భిల్వారా, అల్వార్, బికనేర్, దౌసా, చిత్తోర్‌గఢ్, బాడ్మేర్, టోంక్, అజ్మీర్, నగౌర్, సవాయ్ మధోపుర్, కోటా, బుంది, జల్వార్, శికర్ జిల్లాలపై 'ఇంటర్నెట్ నిషేధం' ప్రభావం పడింది.
పోటీ ఎక్కువే..
రీట్ పరీక్షకు నిరుద్యోగుల్లో మంచి ఆదరణ ఉంది. పరీక్ష కోసం.. శనివారమే హడావుడి మొదలైంది. పరీక్షా కేంద్రాలకు(3,993) వెళ్లేందుకు అభ్యర్థులు పరుగులు తీయడం వల్ల బస్సులు కిక్కిరిసిపోయాయి. రైల్వే శాఖ 26 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ పరీక్ష రాసేందుకు కట్టుదిట్ట భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు.
ఇదీ చూడండి:- పరీక్షకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం