Dharam Singh Saini Quit BJP: ఉత్తర్‌ప్రదేశ్‌లో గత రెండు రోజులుగా ఎమ్మెల్యేల వరుస రాజీనామాలతో అక్కడి భాజపా ప్రభుత్వం ఉక్కిరిబిక్కరి అవుతోంది. తాజాగా కేబినెట్ మంత్రి ధరమ్ సింగ్ సైనీ సహా ఎమ్మెల్యే ముకేశ్ వర్మ భాజపా నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం ప్రకటించారు. కేవలం మూడు రోజుల్లో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు భాజపాను వీడారు. వీరిలో ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారు.
"ఆయుశ్ శాఖ మంత్రిగా నేను నిబద్ధతతో బాధ్యతలు చేపట్టాను. కానీ వెనుకబడిన వర్గాలు, దళితులు, నిరుద్యోగ యువత, చిన్న-మధ్యతరగతి పరిశ్రమ వ్యాపారుల పట్ల భాజపా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం వల్లే నేను పార్టీని వీడుతున్నాను."
-ధరమ్ సింగ్ సైనీ
శిఖోహాబాద్ ఎమ్మెల్యే ముకేశ్ వర్మ కూడా ఇదే కారణాన్ని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఓబీసీ నేత స్వామి ప్రసాద్ మౌర్య నేతృత్వంలో న్యాయ పోరాటం కొనసాగిస్తాను అని పేర్కొన్నారు.
అఖిలేశ్‌తో భేటీ
రాజీనామా అనంతరం ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ను ధరమ్‌సింగ్ సైనీ కలిశారు. సైనీ రాజీనామాను స్వాగతించిన అఖిలేశ్.. ఆయను పార్టీలోకి ఆహ్వానించారు. సామాజిక న్యాయం కోసం పారాటం చేసే మరో నేత తమ పార్టీలో చేరుతున్నట్లు ట్వీట్ చేశారు.
సైకిల్ ఎక్కుతారా?
భాజపాకు రాజీనామా చేసిన నేపథ్యంలో వర్మ కూడా సమాజ్‌వాదీ పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో భాజపా తనకు టికెట్ ఇవ్వదని భావించి ఎస్పీ నేతలను వర్మ కలవడం గమనార్హం.
ఇప్పటివరకు స్వామిప్రసాద్ మౌర్య, దారా సింగ్ చౌహాన్, రోషన్ లాల్, భగవతి సాగర్, బ్రజేశ్ ప్రజాపతి, అవతార్ సింగ్ భదానా, వినయ్ శక్యా భాజపాను వీడారు. తాజాగా ధరమ్ సింగ్ సైనీ, ముకేశ్ వర్మ రాజీనామాలతో ఈ సంఖ్య తొమ్మిదికి చేరింది.
'భాజపాలో రాజీనామాలు లేని రోజు లేదు'
ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజీనామాల పర్వంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ స్పందించారు. భాజపాలో నిత్యం ఎవరో ఓ నేత ఆ పార్టీని వీడుతూ ఉంటారని వ్యాఖ్యానించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులే అందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. "13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా ప్రకటించనున్నారు. నాకు అందిన సమాచారం ప్రకారం వీరిలో నలుగురు ఎమ్మెల్యేలు నేడు ఆ పార్టీని వీడతారు." అని జోస్యం చెప్పారు శరద్ పవార్.
ఇదీ చూడండి : యూపీలో అత్యాచార బాధితురాలి తల్లికి కాంగ్రెస్ టికెట్