MLA ANAM RAMANARAYANA REDDY: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం వేడెక్కుతోంది. ఇంకా సంవత్సరం సమయం ఉండగానే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. అయితే గత ఎన్నికల్లో 153 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. 2024లో జరిగే ఎన్నికల్లో 175 సీట్లు గెలవాలని పంతం పట్టింది. కానీ తాజాగా వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో వైసీపీ ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. ముఖ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 7కి 7 గెలవాలనుకున్న వైసీపీకి పరాభవం ఎదురవడంతో ఇందుకు కారణమంటూ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారంటూ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అందులో ఒకరు నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి.
ఏనాడూ ప్రజాస్వామ్య విలువలు ఇంత దిగజారడం చూడలేదు: వైసీపీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చిన ఆనం పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వ్యవస్థల్లో అనేక మార్పులు జరుగుతూ వస్తున్నాయని.. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇలాంటి పరిస్థితి రావడం దారుణమని ఆనం అన్నారు. సమాజంలో ప్రశ్నించే గొంతుకను అణచి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాలుగా అనేక మంది నాయకుల వద్ద పనిచేసినట్లు తెలిపిన ఆనం.. ఏనాడూ ప్రజాస్వామ్య విలువలు ఇంత దిగజారడం చూడలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రశ్నించే గొంతుకను అధికార పార్టీ అణచివేస్తోంది : తన నియోజకవర్గంలో రాజ్యాంగేతర శక్తిని ఇన్‌ఛార్జ్‌గా పెట్టారని ఆరోపించారు. ప్రశ్నించే గొంతుకను ఏ పార్టీ అయినా సద్విమర్శగా తీసుకోవాలని సూచించారు. విమర్శలను స్వీకరించి మంచి జరిగేందుకు ప్రయత్నించాలని హితవు పలికారు. అధికారంలో ఉన్న పార్టీ ప్రశ్నించే గొంతుకను అణచివేస్తోందని మండిపడ్డారు. జిల్లాలో జరిగే దోపిడీ వ్యవస్థల గురించి ప్రశ్నించినట్లు తెలిపారు. అభివృద్ధి నిలిచిపోయింది.. ప్రాజెక్టులు, నిర్మాణాలు జరగట్లేదని చెప్పానన్నారు. విమర్శలను సరిగా చూడలేని ప్రభుత్వంలో తాను పనిచేసినందుకు బాధపడుతున్నట్లు ఆనం తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు లేని విలువలు: మరో వైపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడిన ఆనం.. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఎన్నికలను ఎవరూ నిర్ధారించే పరిస్థితి లేదని తెలిపారు. ప్రశ్నించే వ్యక్తి ఉండకూడదని.. బయటకు పంపాలని ఓ దుర్మార్గ ఆలోచన చేశారని ఆక్షేపించారు. తనను పరిగణలోకి తీసుకోవద్దని కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి కార్యాలయం(CMO) నుంచి ఫోన్లు వచ్చాయని వెల్లడించారు. గత సీఎంలు ప్రజాస్వామ్యం విలువలు తెలిసినవారని.. ఎమ్మెల్యేల విలువను గుర్తించారని ఆనం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అంటే గౌరవం, విలువ లేదని.. విలువలు లేని వ్యవస్థలో కొనసాగలేని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నాలుగు సంవత్సరాలలో సీఎం జగన్‌ను కలిసిన సందర్భాలు చాలా తక్కువ ఆనం వ్యాఖ్యానించారు.
ప్రజలతోనే నా రాజకీయ జీవితం: ఎన్నికలను అడ్డుపెట్టుకుని నా మీద ఆరోపణలు చేస్తున్నారని ఆనం విమర్శించారు. తన భద్రతా సిబ్బందిని ఉపసంహరించారని మండిపడ్డారు. సలహాదారుల సలహాలతోనే ప్రభుత్వం నడుస్తోందని ఆక్షేపించారు. భవిష్యత్తులో మనుగడను ప్రభుత్వం ప్రశ్నార్ధకం చేసుకుందని తెలిపారు. ప్రభుత్వ సలహాదారు నాపై ఆరోపణలు చేయడం గమనించానన్నారు. విమర్శలు చేసిన వ్యక్తి వేల కోట్లకు ఎలా ఎదిగారనేది తనకు తెలుసని స్పష్టం చేశారు. తమ వ్యతిరేక వర్గం నిందలు మోపడం సహజమన్న ఆనం.. తన గురించి తెలిసినవారు ఆ విమర్శలను నమ్మే పరిస్థితి లేదని ధీమా వ్యక్తం చేశారు. ఏకచత్రాధిపత్యాన్ని ఆమోదిస్తే ఉండాలి.. లేకపోతే లేదన్నట్లు పరిస్థితి ఉందని ఆరోపించారు. విమర్శించేవారు పార్టీలో ఉండవద్దని అనుకున్నారని.. కేవలం భజన చేసే వ్యక్తులు కావాలనుకుంటున్నారని విమర్శించారు. దుర్మార్గ ఆలోచనతో తనని బయటకు పంపారని.. తన రాజకీయ జీవితం ప్రజలతో ముడిపడి ఉందని ఆనం తేల్చిచెప్పారు.
ఇవీ చదవండి: