Miss Teen Super Globe : ప్రతిష్టాత్మక మిస్ టీన్ సూపర్ గ్లోబ్ ఇంటర్నేషనల్ 2023 అవార్డును గెలుచుకుంది కర్ణాటక మంగళూరుకు చెందిన బాలిక. దాదాపు 15 దేశాలకు చెందిన 50 మంది పోటీదారులు పాల్గొనగా.. వారందరినీ వెనక్కి నెడుతూ అగ్రస్థానంలో నిలిచింది యశస్విని. థాయిలాండ్ వేదికగా నాలుగు రోజుల పాటు సాగిన ఈ పోటీల్లో పాల్గొన్న యశస్విని.. మిస్ టీన్ 2023 టైటిల్‌ను గెలుచుకుంది.
16 ఏళ్ల యశస్విని దేవాడిగా.. సూరత్కల్ సమీపంలోని కులాయికి చెందిన దేవదాస, మీనాక్షి దంపతుల కుమార్తె. యశస్విని ప్రస్తుతం మంగళూరులోని గోవిందాస్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే, ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తైన తర్వాత.. సెలవుల్లో మిస్ టీన్ మంగళూరు పోటీలు జరగుతున్నట్లు తెలుసుకుని పాల్గొంది. తొలిసారిగా ఈ పోటీల్లో పాల్గొన్న ఆమె.. రన్నరప్‌గా నిలిచింది. అనంతరం హైదరాబాద్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని అవార్డును గెలుచుకుంది. ఆ తర్వాత మిస్ అండ్ మిసెస్ టీన్ సూపర్ గ్లోబ్ జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొని.. 15-19 ఏళ్ల కేటగిరీలో కిరీటాన్ని గెలుచుకుంది.
"ఈ పోటీలకు 15 దేశాలకు చెందిన 50 మంది పోటీదారులు పాల్గొన్నారు. తొలిరోజు పోటీల ప్రారంభ కార్యక్రమం జరగగా.. రెండో రోజు పరిచయ కార్యక్రమం, ఇంటర్వ్యూ రౌండ్ జరిగాయి. వివిధ దేశాల పోటీదారులు.. వారి సంప్రదాయ వస్త్రాలను ధరించి వివిధ రకాల ఆహార పదార్థాలను ప్రదర్శనకు తీసుకువచ్చారు. మూడో రోజు టాలెంట్ రౌండ్.. నాలుగో రోజు చివరిదైన కాస్ట్యూమ్ రౌండ్ జరిగాయి. అన్ని రౌండ్ల ప్రదర్శనను చూసిని జడ్జీలు.. నన్ను విజేతగా నిర్ణయించారు."
--యశస్విని దేవాడిగా, మిస్ టీన్ సూపర్ గ్లోబ్ ఇంటర్నేషనల్ 2023 విజేత
"నా కూతురు ఈ అవార్డు గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎక్కడికి వెళ్లినా మన సంస్కృతి, సంప్రదాయాలను వదిలిపెట్టకూడదు అని చెప్పా. అంతర్జాతీయ పోటీలకు వెళ్లినా.. తన ముక్కుపుడకను తీయలేదు. ఆమె చాలా కష్టపడి.. ఈ ఘనతను సాధించింది."
--మీనాక్షి దేవాడిగా, యశస్విని తల్లి
మిస్ టీన్ అవార్డును గెలుచుకున్న యశస్విని.. తన తదుపరి లక్ష్యం మిస్ ఇండియా, మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పోటీల్లో గెలవడమేనని చెప్పింది. అయితే ప్రస్తుతం మోడలింగ్ పోటీల్లో పాల్గోనేందుకు యశస్వినికి అవకాశం లేదు. ఆమెకు 18 ఏళ్లు పూర్తైన తర్వాత మాత్రమే ఇలాంటి పోటీల్లో పాల్గొనేందుకు అనుమతి ఉంటుంది.
'మిసెస్ ఇండియా' కిరీటం కర్ణాటక మహిళ సొంతం.. మిసెస్ యూనివర్స్ టైటిల్‌పై గురి