ఎనిమిది రోజుల క్రితం అదృశ్యమైన పదేళ్ల బాలుడు చెరువులో శవమై కనిపించిన ఘటన మధ్యప్రదేశ్, జబల్పూర్ జిల్లా బెల్ఖేడా పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. జగ్పురా గ్రామానికి చెందిన రామ్‌దాస్ కేవాత్ కుమారుడు రాజా(10), పొరుగున ఉన్న తమ మామయ్య ఇంటికి వెళతానని మార్చి 5 సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రైనా తమ కుమారుడి జాడ తెలియకపోగా.. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శవమై..
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు 8 రోజులు గడిచినా.. బాలుడి జాడ తెలియలేదు. బంధువులను, సన్నిహితులను, ఇరుగు పొరుగువారిని ప్రశ్నించగా కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ పోలీసులు వాటిని వెల్లడించలేదు. చివరకు నర్సింగాపూర్ జిల్లా తేమీ పోలీసు స్టేషన్ పరిధిలోని పోలీసులు.. మోర్చాఘాట్ సమీపంలోని నీటిలో తేలియాడుతున్న శవాన్ని కనుగొన్నారు. బెల్ఖేడా పోలీసు స్టేషన్‌కు సమాచారాన్ని అందించారు. ఆ శవం తమ కుమారుడిదేనని తల్లిదండ్రులు గుర్తించారు. బాలుడి తలపై గాయాల గుర్తులను పోలీసులు గుర్తించారు.
డబ్బులు ఇవ్వలేక..
రాజా సోదరి, అదే గ్రామానికి చెందిన 15 ఏళ్ల యువకుడు ప్రేమించుకుంటున్నారు. వారిరువురు సన్నితంగా ఉండటాన్ని రాజా చూశాడు. ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెబుతానని అన్నాడు. చెప్పకుండా ఉండాలంటే తనకు రూ.200, ఆడుకోవడానికి మొబైల్ ఇవ్నాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. దీనికి అంగీకరించిన యువకుడు.. రాజా అడిగినప్పుడు డబ్బులు ఇచ్చేవాడు. రాజా తరచూ అడగ్గా విసిగిపోయాడు. ఈ క్రమంలో రాజా అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. మార్చి 5న మామయ్య ఇంటికి వెళుతున్న రాజాకు ఎదురైన యువకుడు మభ్యపెట్టి అతడ్ని దారి మళ్లించాడు. సరస్సువైపు నడిపించాడు. అక్కడే ఉన్న వెదురు కర్రలతో రాజా తలపై బాది.. గాయపడిన రాజాను చెరువులోకి తోసేసి యాథావిధిగా ఇంటికి వచ్చాడని పోలీసులు చెప్పారు.
తనూ వెతుకుతున్నట్లే నటన..
బాలుడి అదృశ్యంతో ఆందోళన చెందిన గ్రామస్థులంతా కలిసి మరుసటిరోజు వెతకసాగారు. నిందితుడు ఏమీ ఎరుగనట్లే అందరితోపాటు కలిసి వెతికాడు. అప్పటికే అతనిపై అనుమానం ఉన్న పోలీసులు.. నిందితుడిని గమనించసాగారు. బాలుడి శవం లభించిన అనంతరం యువకుడిని ప్రశించిన పోలీసులు నిజాన్ని నిగ్గు తేల్చారు. రాజా మృతి వెనుక ఉన్న నాటకీయ పరిణామాలను చూసి ఆశ్చర్యపోయారు. యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని జువనైల్ కోర్టు ముందు హాజరుపరిచారు.
ఇదీ చదవండి: మంటల్లో చిక్కుకుని ఐదుగురు సజీవదహనం