Bomb Blast In Toilet Minor Died : బంగాల్లో బాంబు పేలుడు కలకలం రేపింది. మరుగుదొడ్డిలో బాంబు పేలడం వల్ల ఓ 12 ఏళ్ల బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం ఉత్తర 24 పరగణాల జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాన్‌గావ్ టౌన్ పరిధిలోని బక్షిపల్లి ప్రాంతంలో 12 ఏళ్ల బాలుడు ఓ సైకిల్ గ్యారేజీలో పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో పబ్లిక్ టాయిలెట్ వద్దకు వెళ్లాడు. అక్కడ ఓ శౌచాలయంలోకి వెళ్తుండగా అకస్మాత్తుగా బాంబు పేలింది. దీంతో బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పెద్ద శబ్దం విన్న బాలుడి తండ్రి ప్రశాంత్ రాయ్.. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నాడు. రక్తపు మడుగులో ఉన్న తనయుడి మృతదేహాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Bomb Blast In West Bengal Minor Died : ఘటనా స్థలానికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్.. ఆ మరుగుదొడ్ల నుంచి మరో 8 గ్రనేడ్లను స్వాధీనం చేసుకుంది. అంతకుముందే ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటన ఎలా జరిగిందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, అక్కడ ఆరు బాంబులు పేలినట్లు బన్గావ్ మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ గోపాల్ సేథ్ తెలిపారు. 'తృణమూల్ నబో జోయర్' అనే కార్యక్రమంలో భాగంగా మరికొద్ది రోజుల్లో తృణమూల్ కాంగ్రెస్ నేత, మమతా బెనర్జీ మెనల్లుడు అభిషేక్ బెనర్జీ ఉత్తర 24 పరగణాలకు రానున్నారని.. ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకే ఈ బాంబు పేలుడు జరిగిందని ఆరోపించారు.
ఈ ఘటనపై ఉత్తర బాన్‌గావ్ బీజేపీ ఎమ్మెల్యే అశోక్ కీర్తానియా స్పందించారు. చాలా కాలంగా పోలీసులే బాంబులను నిల్వ చేశారని ఆరోపించారు. తన మాటలను పోలీసులు పట్టించుకోవడం లేదని చెప్పారు. పోలీసులు బాంబులను స్వాధీనం చేసుకోకపోవడం వల్లే బాలుడు చనిపోయాడని.. అతడి మృతికి పోలీసు యంత్రాంగమే కారణం అని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలు ఉన్నందునే మరుగుదొడ్లలో బాంబులు అమర్చారని విమర్శలు చేశారు.
ఐఈడీ పేలి బాలుడు మృతి..
గత నెలలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఝార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీకి ఓ చిన్నారి బలయ్యాడు. ఒక్కసారిగా ఐఈడీ పేలడం వల్ల పదేళ్ల బాలుడు మృతి చెందాడు. రెంగ్రాహటు ప్రాంతంలోని బంగ్లాసాయ్ టోలాకు చెందిన బాలుడు.. కెండు ఆకుల కోసం రోలాబ్రుపీ జెంగగాద అడవుల్లోకి వెళ్లాడని.. ఆక్కడ బాంబు పేలిందని పోలీసులు తెలిపారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.