'అబద్ధాలు, అసత్య నినాదాలను ప్రచారం చేసేందుకు' ప్రధాని మోదీ నేతృత్వంలోని 'రహస్య మంత్రిత్వ శాఖ' అత్యంత సమర్థవంతంగా పనిచేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. మోదీ జి-7 ప్రసంగంపై పలు విమర్శలు గుప్పించిన రాహుల్.. ప్రధాని తన వాక్చాతుర్యంతో అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
"భారత ప్రభుత్వంలో అత్యంత సమర్థవంతమైన మంత్రిత్వ శాఖ ఏది? అని ప్రశ్నించిన రాహుల్.. అది అబద్ధాలు, అసత్య నినాదాల రహస్య మంత్రిత్వ శాఖ" అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
సుప్రీంకోర్టునూ తప్పుదోవ..
మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ సైతం ప్రధాని మోదీ జి-7 సదస్సు ప్రసంగంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. కరోనా టీకాల లైసెన్స్‌పై మోదీ సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.
"'ఒకే భూమి-ఒకే ఆరోగ్యం' అనే నినాదానికి భారత్ కట్టుబడి ఉందని జి-7 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు వ్యాక్సిన్ల పేటెంట్ హక్కుల మాఫీని సైతం ప్రభుత్వం కోరుతోందని తెలిపారు. కానీ తప్పనిసరి లైసెన్సింగ్‌ను అమలు చేసే ఉద్దేశం లేదని సుప్రీంకోర్టులో మోదీ ప్రభుత్వం పేర్కొంది."
-జైరాం రమేష్, కాంగ్రెస్ నేత
ఇవీ చదవండి: 'టీకా పంపిణీ విధానమే సరిగా లేదు'