KTR responded on TSCPSC paper leakage: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ, తదనంతర పరిణామాల నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పలువురు మంత్రులు, టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి, మాజీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి, ఉన్నతాధికారులు ఈ అంశంపై సుదీర్ఘంగా సమీక్షించారు. అనంతరం ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక ఇచ్చారు.
నివేదిక ఆధారంగా సీఎం కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను మీడియాకు వివరించిన మంత్రి కేటీఆర్.. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పుతో వ్యవస్థకు చెడ్డపేరు తెచ్చింది తప్ప.. వ్యవస్థ తప్పు కాదని అన్నారు. జరిగిన పరిణామాలకు తాము కూడా బాధపడుతున్నామని వ్యాఖ్యానించారు. పేపర్ల లీకేజీ వ్యవహారంలో నిందితుల వెనక ఎవరున్నా కఠినంగా శిక్షిస్తామని,.. ఎవర్నీ వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
నిందితుడు రాజశేఖర్‌రెడ్డి బీజేపీలో క్రియాశీలకంగా ఉన్నారని కేటీఆర్ తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్లు కుట్ర అని గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారన్న ఆయన.. ప్రభుత్వాన్ని బదనాం చేసే ఉద్దేశంతో కుట్రకోణం ఏమైనా ఉంటే తేల్చాలని డీజీపీని కోరినట్లు వివరించారు.
నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: చిలువలు, పలవలు చేసి అశాంతి, అసహనం వచ్చేలా.. ప్రభుత్వంపై వ్యతిరేకత కోసం ఇష్టారీతిన వ్యాఖ్యలు తగవని కేటీఆర్ సూచించారు. రాజకీయ నిరుద్యోగులు చేసే వ్యాఖ్యలను పట్టించుకోవద్దని.. వారి మాటలు విశ్వసించవద్దని అభ్యర్ధులను కోరారు. నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఆయన... వారి బాధను అర్థం చేసుకోగలమని తెలిపారు. పిల్లల జీవితాలతో దయచేసి ఆడుకోవద్దని.. రాజకీయ ప్రయోజనాల కోసం.. అనుమానాలు రేకెత్తించేలా రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని విపక్షాలకు హితవు పలికారు.
ఎవరు ఏమిటో ప్రజలు తేలుస్తారు: ఈ క్రమంలోనే 6, 7 నెలల్లో ఎన్నికలు ఉన్నాయని.. ఎవరు ఏమిటో ప్రజలు తేలుస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దేశంలో ఉద్యోగాలు భర్తీ చేయని వారు.. తమకు నీతులు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. లీకేజీ వ్యవహారంతో ఐటీ మంత్రికి ఏం సంబంధమని అన్నారు. గుజరాత్, మధ్యప్రదేశ్ లో ముఖ్యమంత్రి, మంత్రులు రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. సిట్ దర్యాప్తు పూర్తి కాకముందే లేని పోని అనుమానాలు ఎందుకని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
24 గంటలు.. రీడింగ్ రూంలు: రద్దైన పరీక్షల అభ్యర్థుల బాధను తాము అర్థం చేసుకోగలమని.. అనుమానాలు, అపోహలకు తావుండరాదన్న ఉద్దేశంతోనే రద్దు చేసినట్లు కేటీఆర్ వివరించారు. వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని.. ఈ క్రమంలోనే మెటిరీయల్‌ను ఆన్లైన్లో ఉచితంగా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. స్టడీసర్కిళ్లను మరింత బలోపేతం చేయడంతో పాటు.. రీడింగ్ రూంలను 24 గంటల పాటు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ఉచితంగా మెటీరియల్, భోజన వసతి కూడా కల్పిస్తామని కేటీఆర్ వివరించారు .
లోపాలు లేని వ్యవస్థ కోసం చర్యలు తీసుకుంటాం: దేశంలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉత్తమమైనదని.. యూపీఎస్సీ ఛైర్మన్‌తో పాటు ఇతర రాష్ట్రాలు కూడా ప్రశంసించినట్లు కేటీఆర్ గుర్తు చేశారు. భవిష్యత్‌లో పొరపాట్లు జరగకుండా ఏం చేయాలన్న విషయమై తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. అవసరమైన మార్పులు, సంస్కరణలు తీసుకొస్తామని.. ఈ విషయమై నిపుణులతో చర్చిస్తున్నట్లు వివరించారు. లోపాలు లేని వ్యవస్థ కోసం చర్యలు తీసుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.
"కమిషన్‌లోనే పనిచేసే ఇద్దరు చేసిన తప్పు.. వ్యవస్థకే చెడ్డపేరు తెచ్చింది. ఇద్దరి తప్పుడు పనుల వల్ల వ్యవస్థకే చెడ్డపేరు వచ్చింది. ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి ఇద్దరే కాదు.. ఇంకా ఎవరున్నా కఠిన చర్యలు తప్పవు. వ్యవస్థ తప్పుకాదు.. కేవలం ఇద్దరు చేసిన తప్పు మాత్రమే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. సాధ్యమైనంత వేగంగా పరీక్షలు నిర్వహిస్తాం." - కేటీఆర్, మంత్రి
ఇవీ చదవండి: