జమ్ముకశ్మీర్లో ఉగ్రవాద రహస్య స్థావరాన్ని ఛేదించాయి సరిహద్దు భద్రతా బలగాలు. పూంచ్ జిల్లాలోని బయటపడిన ఆ స్థావరం నుంచి భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు రక్షణ ప్రతినిధి తెలిపారు.
మండీ పట్టణానికి 10కిలోమీటర్ల దూరంలో గల హాదిగూడలోని దోబా మొహల్లా అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ స్థావరం బయటపడినట్టు పేర్కొన్నారు అధికారులు. అక్కడి నుంచి మూడు మ్యాగజైన్ల ఏకే47 రైఫిల్(82 రౌండ్ల సామర్థ్యం), 33 రౌండ్ల మూడు చైనీస్ పిస్టల్స్(5 మ్యాగజైన్స్), 4 చేతి గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు. అంతేకాకుండా.. అండర్ బారెల్ గ్రెనేడ్ లాంఛర్(యూబీజీఎల్), ఓ వైర్లెస్ సెట్నూ ఆ ప్రాంతంలో ఉన్నట్టు సైన్యం వెల్లడించింది.
ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతోనే ఈ ఆపరేషన్ చేపట్టినట్టు తెలిపాయి. అయితే.. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ ఆపరేషన్ను కొనసాగిస్తోంది సైన్యం.
ఇదీ చదవండి: పాక్ సరిహద్దులో మరో సొరంగం- సైన్యం గుర్తింపు