Migration in Uttarakhand: భారత సరిహద్దులకు సమీపంలో చైనా కొత్తగా గ్రామాలను నిర్మిస్తూ ప్రజలను తరలిస్తున్నట్లు చాలా వార్తలు వస్తున్నాయి. ఈ వాదనలకు బలం చేకూర్చుతూ.. కొన్ని ఉపగ్రహ చిత్రాలు సైతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. అయితే.. భారత్ వైపు చైనా-నేపాల్ సరిహద్దుల్లోని గ్రామాలు ఖాళీ అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సరిహద్దులను విడిచి ప్రజలు వలస వెళ్తున్నారు.
ఉత్తరాఖండ్ పిథోరాగఢ్ జిల్లా.. చైనా-నేపాల్ సరిహద్దుల్లోని 59 గ్రామాలు ఇప్పటికే ఖాళీ అయ్యాయి. ఏ గ్రామం చూసినా మనిషి జాడ కనిపించే పరిస్థితులు లేవు. సరిహద్దుల్లోని కొండ ప్రాంతాల్లో వలసలను నిరోధిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్న వాదనలకు విరుద్ధంగా అక్కడి దృశ్యాలు కనిపిస్తున్నాయి. గడిచిన 3 ఏళ్లలో వలసలు పెరిగినట్లు మైగ్రేషన్ కమిషన్ నివేదిక స్పష్టం చేస్తోంది. మరో 41 గ్రామాల్లో 50 శాతానికిపైగా ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు.
జల్ జీవన్ మిషన్ తాజా నివేదిక ప్రకారం.. పిథోరాగఢ్ జిల్లాలో ప్రస్తుతం 1,542 గ్రామాల్లోనే ప్రజలు ఉన్నారు. మూడేళ్ల క్రితం ఆ సంఖ్య 1,601గా ఉండేది. 59 గ్రామాలు పూర్తిగా ఖాళీ అయ్యాయి. ఇందులో పిథోరాగఢ్ తహసీల్లో 13, గంగోలీహాట్, డీడీహాట్, బెరీనాగ్ తాలుకాల్లో ఒక్కోదాంట్లో ఆరు, ధారచూలాలో 3, గణాఈ-గంగోలీ, ఫాంఖూ, థాల్లో 3 చొప్పున గ్రామాలు ఎడారిని తలపిస్తున్నాయి.
" మూడేళ్ల క్రితం గ్రామాల్లో 16వేల మంది జనాభా ఉండేది. 2019, 2020, 2021లో ఇంటింటి సర్వే చేపట్టాం. బ్రాహ్మణ క్షేత్రంలోని 1,601 గ్రామాల్లో సుమారు 40-50 గ్రామాలు గడిచిన మూడేళ్లలో దాదాపుగా ఖాళీ అయ్యాయి."
- రంజీత్ ధర్మసత్తూ, జల్ నిగమ్ అధికారి.
41 గ్రామాల్లో సగమే..
మైగ్రేషన్ కమిషన్ డేటాను పరిశీలిస్తే పిథోరాగఢ్ జిల్లాల్లో 41 గ్రామాల్లో 50 శాతానికిపైగా ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. అందులో గంగోలీహాట్ అభివృద్ధి బ్లాక్లో 25, బేరినాగ్ బ్లాక్లో 12 గ్రామాలు, కనాలిచినా, మూనాకోటే బ్లాకుల్లో 2 గ్రామాల్లో సగానిపైగా ప్రజలు వలస వెళ్లారు.
వలసలకు కారణాలేంటి?
ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడి 21 ఏళ్లు గడుస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధి కోసం గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించింది. కానీ, ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో కనీస వసతులు లేవు. చాలా గ్రామాలకు సరైన రోడ్లు లేవు. విద్యుత్తు, నీరు, సమాచారం, ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి సౌకర్యాలు లేకపోవటం వల్ల వలసలు పెరుగుతున్నాయి.
జిల్లాలో సరైన వైద్య సౌకర్యం లేకపోవటం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ ప్రాంతాల్లో నాటు వైద్యంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. గర్భణీలకు చికిత్స అందించేందుకు కనీసం రేడియోలజిస్ట్ లేకపోవటం గమనార్హం. 40 గ్రామాలకుపైగా సరైన రోడ్డు మార్గం లేదు. జిల్లాలో జనాభా దాదాపు 50వేల వరకు ఉంటుంది. ఎవరైనా అనారోగ్యానికి గురైతే రోడ్డు వరకు డోలీలో కట్టి మోసుకురావాల్సిందే. 400 కుటుంబాలకు ఇప్పటికీ విద్యుత్తు సౌకర్యం లేదంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
స్వావలంబన సాధిస్తేనే..
పిథోరాగఢ్ జిల్లాలోని ప్రజలకు ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం, పశువుల పెంపకం. అటవీ జంతువుల దాడులతో వ్యవసాయాన్ని వదులుకుంటున్నారు. పశువుల పెంపకం అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్రభుత్వం ముందుకు వచ్చి సేంద్రీయ వ్యవసాయం, పశువుల పెంపకంపై ప్రోత్సాహకాలు కల్పిస్తే కొంత మేర వలసలు తగ్గేందుకు వీలు కలుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికే చాలా పథకాలు తీసుకొచ్చినా అవి.. భూస్వాములకే అందుతున్నాయనేది అక్కడి రైతుల వాదన. చిన్న రైతులకు సైతం అందినప్పుడే సత్ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.
మరోవైపు.. సరిహద్దు ప్రాంతమైన ఈ జిల్లాలో పర్యటకాన్ని అభివృద్ధి చేస్తే ఉపాధి అవకాశాలు లభిస్తాయని పలువురు చెబుతున్నారు.
ఇదీ చూడండి: