కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన ఆంక్షల కారణంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వలస కార్మికులకు అండగా నిలిచేలా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. వారికి ఆహార భద్రత కల్పించాలని, నగదు బదిలీ చేయాలని, ఇతర సంక్షేమ కార్యక్రమాల ద్వారా కూడా తోడ్పడాలని పిటిషన్‌దారులైన ఉద్యమకారులు అంజలి భరద్వాజ్, హర్ష్ మందర్, జగ్‌దీప్ ఛోకర్ కోరారు. వలస కార్మికుల సమస్యలను గత ఏడాది మేలో సుమోటోగా విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. వారిని ఉచితంగా స్వస్థలాలకు చేర్చడం, రైళ్లు-బస్సుల్లో ఉచితంగా ఆహారం అందించడం తదితర సహాయక చర్యలు చేపట్టాలంటూ ప్రభుత్వాలను ఆదేశించిన సంగతి గమనార్హం.
కొవిడ్ ఔషధాలకు జీఎస్‌టీ మినహాయించాలంటూ..
కొవిడ్ చికిత్సలో ఉపయోగించే రెమ్‌డెసివిర్, టొసిలిజుమాబ్, ఫావిపిరవిర్ వంటి ఔషధాలు; వెంటిలేటర్ తదితర వైద్య పరికరాలను వస్తు-సేవల పన్ను (జీఎస్‌టీ) నుంచి మినహాయించాలంటూ 'పబ్లిక్ పాలసీ అడ్వొకేట్స్' అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీం కోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేసింది.
ఇదీ చూడండి: ప్రధాని నేతృత్వంలో నేడు కేంద్ర మంత్రిమండలి భేటీ