Menstrual leave bill: అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో కొందరు అధికార భాజపా ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వటాన్ని వ్యతిరేకించిన ఎమ్మెల్యేలు.. ఆ విషయాన్ని డర్టీ థింగ్(అశుభ్రమైన విషయం) అంటూ పేర్కొన్నారు. నెలసరి సెలవులు కల్పించాలంటూ మార్చి 11న కాంగ్రెస్ సభ్యుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ తీర్మానంపై చర్చ సందర్భంగా.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ అంశంపై ఈటీవీ భారత్‌తో మాట్లాడారు అరుణాచల్‌ప్రదేశ్ మహిళా సంక్షేమ సంఘం(ఏపీడబ్ల్యూడబ్ల్యూఎస్) సెక్రెటరీ జనరల్ కానీనద మాలింగ్.
"నెలసరిలో ఉన్న మహిళలు, యువతుల సెలవు మంజూరుపై ప్రైవేటు సభ్యుల తీర్మానాన్ని విభేదించినప్పటికీ సభలోని సభ్యులు గౌరవంగా.. అవగాహనతో మాట్లాడాలి. జీవన క్రియలో భాగమైన ప్రక్రియను అసభ్య పదజాలంతో వ్యాఖ్యానించటం మహిళలు, యువతులను అగౌరవపరచటం, వారిని విస్మరించటమే అవుతుంది. రుతుక్రమం ఏమీ నిషేధించాల్సిన అంశం కాదు. సభలో మాట్లాడేటప్పుడు సభ్యులు ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నాం. అశుభ్రమైన అంశం అనే పదాన్ని రికార్డుల్లోంచి తొలగించాలని స్పీకర్‌ను ఎన్జీఓ కోరుతోంది."
- కానీనద మాలింగ్, ఏపీడబ్ల్యూడబ్ల్యూఎస్ సెక్రెటరీ జనరల్
వివాదం ఏమిటి?
పనిచేస్తున్న మహిళలు, యువతులకు నెలసరి సెలవులు ఇచ్చేలా బిల్లు తీసుకురావాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నేత, పాసిఘట్ ఎమ్మెల్యే నినాంగ్ ఎరింగ్ ప్రైవేటు మెంబర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యంగా రుతుక్రమం తొలిరోజున సెలవు ఇవ్వాలని కోరారు. జపాన్, ఇటలీ, భారత్‌లోని కేరళ, బిహార్ వంటి రాష్ట్రాల్లో నెలసరి సెలవులు అమలులో ఉన్నాయని గుర్తు చేశారు. రుతుక్రమం రోజుల్లో పనిచేయటం మహిళలకు ఇబ్బందిగా ఉంటుందని, ముఖ్యంగా తొలిరోజున చాలా అసౌకర్యంగా భావిస్తారని తెలిపారు. ఆ సమయంలో ఒకరోజు సెలవు ఇస్తే.. వారి విధులను మరింత చురుకుగా చేస్తారని చెప్పారు.
ఈ అంశాన్ని పలువురు భాజపా సభ్యులు వ్యతిరేకించారు. రుతుస్రావం వంటి లిట్రా చీజ్(మురికి విషయం)పై చాలా పవిత్రమైన అసెంబ్లీలో చర్చించాలా? అని కొలోరియాంగ్ నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే లోకం తస్సర్ ప్రశ్నించారు. మరోవైపు.. దోయిముఖ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా ఎమ్మెల్యే తానా హలీ సైతం పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నైషి తెగ ఆచారం ప్రకారం నెలసరి సమయంలో పురుషులతో మహిళలు కలవకుండా.. వారితో భోజనం చేయకుండా నిషేధించినట్లు చెప్పారు. వారి వ్యాఖ్యలపై రాజకీయంగా దుమారం చెలరేగింది.
మరోవైపు.. ఈ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని ఎరింగ్కు సూచించారు అరుణాచల్ ప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి అలో లిబాంగ్. మహిళా శాసనసభ్యులు, ఇతర సభ్యులతో చర్చించిన తర్వాత ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఇదీ చూడండి: ముగ్గురు భార్యలు.. విలాసవంతమైన జీవితం.. కళ్లలో కారం చల్లి హత్య!