తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు దివంగత జయలలిత, ఎంజీ రామచంద్రన్ల స్మారక ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు ఇతర భాజపా ప్రముఖుల ఫొటోలను ప్రదర్శించారు. కొద్ది రోజుల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా-ఏఐఏడీఎంకే కూటమిగా పోటీ చేయనున్న నేపథ్యంలో ఈ ఫొటోల ప్రదర్శన చర్చనీయాంశమైంది.
అందుకే ఫొటోలు..
జయలలిత స్మారకంగా నిర్మించిన ఈ ఆలయం ఆమె చూపిన తెగువ, త్యాగాలను ప్రపంచానికి చాటడానికే అని తమిళనాడు రెవెన్యూ శాఖ మంత్రి ఆర్బీ ఉదయ కుమార్ అన్నారు. ఈ ఆలయంలో భాజపా నాయకుల ఫొటోల ప్రదర్శన గురించి మంత్రి వద్ద ప్రస్తావించగా.. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. జేపీ నడ్డా కేంద్ర ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు మధురైలో ఎయిమ్స్ నిర్మాణం జరిగిందని గుర్తుచేశారు. అదే విధంగా.. రాష్ట్రం నుంచి ఎంపికైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గర్వకారణంగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ స్మారక ఆలయంలో వారి ఫొటోలు ఉంచడానికి కారణం ఇదేనని వివరించారు. ఈ ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
జనవరిలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ఆలయాన్ని ఉదయ కుమార్ పర్యవేక్షించారు. తిరుమంగళం సమీపంలోని టీ.కునాథూర్ వద్ద 12 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు.
ఇదీ చదవండి: 'తమిళవాదం'పై డీఎంకే, అన్నాడీఎంకే ఏకస్వరం