మాజీ ఉగ్రవాదిని కాల్చి చంపినందుకు రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ మేఘాలయ హోంమంత్రి లక్మెన్ రింబుయి.. ఆదివారం రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో లొంగిపోయిన నిషేధిత హిన్నీవ్రేప్ నేషనల్ లిబరేషన్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి చెరిస్టర్ఫీల్డ్ తంగ్‌కీవ్ హత్య ఘటనపై న్యాయ విచారణ జరపాలని ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మాను రింబుయ్ కోరారు.
చట్టవిరుద్ధంగా అతని నివాసంలోనే తంగ్కీవ్ను పోలీసుల కాల్చి చంపడంపై తాను దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో రింబుయి పేర్కొన్నారు. "హోం(పోలీసు) డిపార్ట్‌మెంట్ బాధ్యతల నుంచి నన్ను తక్షణమే తప్పించాలని మిమ్మల్ని(సీఎం) కోరుతున్నాను. తంగ్‌కీవ్ హత్యపై స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలి" అని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఈ ఘటన గురించి హోంమంత్రికి తెలియకపోవడంపై విస్మయం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి సంగ్మా.. రింబుయి రాజీనామాను ఆమోదించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఘటన నేపథ్యం..
2018లో లొంగిపోయిన తంగ్‌కీవ్.. రాష్ట్రంలో వరుసగా జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించిన కేసులో అతని ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు పోలీసులు. ఈ క్రమంలో పోలీసు బృందంపై తంగ్‌కీవ్ కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో అతను మరణించాడు.
తంగ్‌కీవ్ లొంగిపోయిన తర్వాత పేలుళ్లకు సూత్రధారిగా ఉన్నట్లు ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: ఉత్కంఠకు తెర- దిల్లీ చేరుకున్న ఎయిరిండియా విమానం