Modi On WHO Traditional Medicine: ప్రపంచ ఆరోగ్య సంస్థ సంప్రదాయ ఔషధ కేంద్రాన్ని భారత్‌లో ఏర్పాటు చేయడం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. గుజరాత్లో ఏర్పాటు చేయబోయే ఈ కేంద్రానికి ఏప్రిల్ 19న శంకుస్థాపన చేయనున్నారు. ప్రపంచ శ్రేయస్సు కోసం సంప్రదాయ ఔషధాన్ని ఉపయోగించే విధంగా కేంద్రం ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు. ఈ మేరకు గుజరాత్లో తన పర్యటనకు సంబంధించిన వివరాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతర్జాతీయ ఆయుష్ సమావేశంతో పాటు ఆదివాసీ సమ్మేళనంలో పాల్గొననున్నట్లు వెల్లడించారు.
ప్రధాని మూడు రోజుల గుజరాత్ పర్యటన సోమవారం ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా గాంధీనగర్, బనాస్కాంఠా, జామ్‌నగర్, దాహోద్ జిల్లాలో వివిధ కార్యక్రమాలకు మోదీ హాజరవుతారు. సోమవారం విద్యా సమీక్ష కేంద్రాన్ని సందర్శిస్తారు. విద్యారంగంలో పనిచేసేవారితో ముచ్చటిస్తారు. బనాస్కాంఠాలో జరిగే కార్యక్రమంలో మంగళవారం పాల్గొంటారు. కొత్త డెయిరీ కాంప్లెక్స్, బంగాలదుంప ప్రాసెసింగ్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తారు. ఈ రెండు ప్రాజెక్టులు స్థానిక రైతులను మరింత శక్తిమంతం చేస్తాయని మోదీ ఆకాంక్షించారు. బుధవారం గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమావేశంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో జరుగుతుంది. అదే రోజు దాహోద్‌లో ఆదివాసీ సమ్మేళనంలోనూ మోదీ పాల్గొంటారు.
ఇదీ చదవండి: 'భాజపాతో కాంగ్రెస్ సీనియర్ల కుమ్మక్కు- మీ పార్టీలో ఇక నేనుండను!'