సియాచిన్లో 16 ఏళ్ల క్రితం త్రివర్ణ పతాకం ఎగురవేస్తూ ప్రాణాలు కోల్పోయిన జవాను అమ్రిశ్ త్యాగి (Martyred Jawan) మృతదేహానికి అంత్యక్రియలు ముగిశాయి. జవాను స్వస్థలమైన ఉత్తర్ప్రదేశ్ గాజియాబాద్ జిల్లాలోని హిసాలి గ్రామంలో.. అధికారికంగా లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
జవాను భౌతికకాయం తొలుత మురాద్నగర్కు చేరుకోగా.. భారీ సంఖ్యలో ప్రజలు అక్కడికి వచ్చారు. అంతిమ యాత్రకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం తరలి వచ్చారు. దీంతో 58వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
16 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే..
2005లో అమ్రిశ్ త్యాగి.. మరో ముగ్గురితో కలిసి సియాచిన్లో జాతీయ జెండా ఎగురవేశారు. అత్యంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని.. ఎత్తైన ప్రాంతంలో జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. అయితే, మంచుకొండలను దిగి కిందకు వస్తున్న క్రమంలో.. ప్రమాదవశాత్తు వీరంతా జారిపడి ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురి మృతదేహాలను అప్పుడే గుర్తించినా.. అమ్రిశ్ శవం మాత్రం దొరకలేదు. ఆ సమయంలో కొండపై మంచు అధికంగా ఉండటం వల్ల మృతదేహం కిందకు వెళ్లిపోయిందని అధికారులు భావించారు.
కాగా, సెప్టెంబర్ 23న భారత ఆర్మీకి చెందిన కొందరు పర్వతారోహకులకు మంచులో కూరుకుపోయిన ఓ మృతదేహం కనిపించింది. దీనిపై అధికారులు ఆరా తీయగా.. అది అమ్రిశ్దేనని తెలిసింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ఇదీ చదవండి: రేప్ బాధితురాలిపై కానిస్టేబుల్ దాష్టీకం.. ఆరు నెలలుగా...