Margadarsi Chit Fund Case in High Court : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్‌సైట్లో ఉంచిన చిట్ గ్రూపుల విషయంలో అభ్యంతరాలు తెలపాలని చందాదారులను కోరుతూ చిట్స్ రిజిస్ట్రార్ జులై 30న ఇచ్చిన బహిరంగ నోటీసు.. దాని ఆధారంగా చిట్ గ్రూపుల నిలిపివేతను సవాలు చేస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ పి.రాజాజీ హైకోర్టును ఆశ్రయించారు.
గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల చిట్ గ్రూపుల విషయంలో ఇచ్చిన బహిరంగ నోటీసును సవాలు చేస్తూ వేర్వేరుగా మూడు వ్యాజ్యాలు దాఖలు చేశారు. సోమవారం జరిగిన విచారణలో కృష్ణా, ప్రకాశం జిల్లాల చిట్ గ్రూపుల విషయంలో దాఖలైన వ్యాజ్యాల్లో సీనియర్ న్యాయవాదులు నాగముత్తు, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. చిట్ నిర్వహణలో లోపాలు తలెత్తితే వాటిని సరిదిద్దుకునేందుకు ఫోర్‌మెన్‌కు చిట్‌ఫండ్ చట్ట నిబంధనలు అధికారం కల్పిస్తున్నాయని తెలిపారు.
Margadarsi Case: 'మార్గదర్శి మూసివేతకు ఏపీ ప్రభుత్వ కుట్ర.. చట్టనిబంధనల ముసుగులో కక్షసాధింపు'
margadarsi-chit-fund-group-petitions: మార్గదర్శి చిట్‌ఫండ్ బ్రాంచ్‌లలో తనిఖీలు నిర్వహించిన అసిస్టెంట్ రిజిస్ట్రార్ లోపాలను గుర్తించినట్లయితే చిట్ చట్టంలోని సెక్షన్ 46(3) నిబంధనలను అనుసరించి వాటిని సరిదిద్దుకునేందుకు ఫోర్‌మెన్‌కు నోటీసు ఇవ్వాల్సి ఉందన్నారు. అప్పటికీ లోపాలను సరిదిద్దుకోకపోతేనే సెక్షన్ 48H ప్రకారం చిట్ గ్రూప్ నిలుపుదలకు చర్యలు చేపట్టవచ్చన్నారు. కానీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఫోర్‌మెన్‌కు నోటీసు ఇవ్వలేదన్నారు. ఈ నేపథ్యంలో చిట్ గ్రూపుల నిలిపివేతపై.. చిట్ రిజిస్ట్రార్ లేదా డిప్యూటీ రిజిస్ట్రార్‌లు అభ్యంతరాలను స్వీకరించే ప్రశ్నే... ఉత్పన్నం కాదన్నారు.
అభ్యంతరాలను ఆహ్వానిస్తూ చిట్స్ రిజిస్ట్రార్ ఇచ్చిన బహిరంగ నోటీసు చెల్లదన్నారు. చిట్‌ఫండ్ చట్టం ప్రకారం అసిస్టెంట్ రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్ సైతం రిజిస్ట్రార్ నిర్వచనం పరిధిలోకి వస్తారన్నారు. తనిఖీలు చేసిన అసిస్టెంట్ రిజిస్ట్రార్ మాత్రమే లోపాలు సరిచేసుకునేందుకు ఫోర్‌మెన్‌కు నోటీసు ఇవ్వాలన్నారు. అందుకు భిన్నంగా అసిస్టెంట్ రిజిస్ట్రార్ సిఫారసు మేరకు చిట్ గ్రూపుల నిలిపివేత విషయంలో అభ్యంతరాలను ఆహ్వానిస్తున్నట్లు చిట్స్ రిజిస్ట్రార్ బహిరంగ నోటీసులో పేర్కొన్నారని తెలిపారు. ఆ నోటీసు జారీ చేసే అధికార పరిధి రిజిస్ట్రార్‌కు లేదని, అది చెల్లదని చెప్పారు.
margadarshi chitfund : 'ఉల్లంఘనలు అబద్ధం.. ప్రభుత్వ దాడి నిజం'
సిఫారసు చేసే అధికారం చట్టం కల్పించడం లేదన్నారు. చిట్ గ్రూపులను నిలిపివేసి మార్గదర్శిని దెబ్బతీయాలన్న దురుద్దేశంతో బహిరంగ నోటీసులు ఇచ్చారని కోర్టు దృష్టికి తెచ్చారు. బహిరంగ నోటీసు అమలును నిలిపివేయాలని.. తదుపరి చర్యలు తీసుకోకుండా అధికారులను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. చందాదారుల ప్రయోజనాలను కాపాడేలా చిట్‌ఫండ్ చట్ట నిబంధనలు ఉన్నాయని.. సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు.
స్వల్ప లోపాలు చోటు చేసుకున్నాయనే కారణంతో.. చిట్ గ్రూపులను నిలిపివేయకూడదనే ఉద్దేశంతో వాటిని సరిదిద్దుకునేందుకు చిట్‌ఫండ్ చట్టంలోని.. సెక్షన్ 46(3) వెసులుబాటు ఇస్తోందని గుర్తుచేశారు.లోపాలను గుర్తిస్తే వాటిని సరిదిద్దుకునేందుకు నోటీసివ్వాల్సిన బాధ్యతను.. చిట్స్ రిజిస్ట్రార్లపై ఉంచిందని వివరించారు. ఇక్కడ తనిఖీలు నిర్వహించిన అసిస్టెంట్ రిజిస్ట్రార్ లోపాలను సరిదిద్దుకునేందుకు.. నోటీసివ్వలేదని తెలిపారు. చట్టప్రకారం చందాదారుల సొమ్ముకు 100శాతం భద్రత కల్పిస్తున్నారని, వారి ప్రయోజనాలకు.. ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు.
మరో సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. ప్రకాశం జిల్లా చిట్ గ్రూపులకు సంబంధించి బహిరంగ నోటీసు ఇవ్వడానికి ముందే కొన్ని గ్రూపుల నిలిపివేతకు.. అధికారులు ఉత్తర్వులు ఇచ్చారన్నారు. తర్వాత అభ్యంతరాలు ఆహ్వానిస్తున్నారని.. తెలిపారు. ఇది చట్ట నిబంధనలకు విరుద్ధమని కోర్టు దృష్టికి తెచ్చారు. ఒకే తరహా ఆరోపణలతో మూస పద్ధతిలో ఉత్తర్వులు జారీ చేశారని.. తనిఖీలు నిర్వహించిన చిట్ అధికారులు ఏమైనా లోపాలను గమనిస్తే ఆ వివరాలేమిటో తెలియజేస్తూ లోపాలను సరిదిద్దుకునేందుకు తాజాగా.. మరో నోటీసివ్వాలని వాదనలు వినిపించారు.
ఆ విధానాన్ని అనుసరించకుండా సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించారని... తెలిపారు. చిట్ గ్రూపుల నిలుపుదల విషయం చాలా తీవ్రమైందని, అలాంటి చర్యలకు ఉపక్రమించే ముందు ఫోర్‌మెన్లకు నోటీసివ్వాలని చట్టనిబంధనలు స్పష్టం చేస్తున్నాయన్నారు. ఆర్థికపరమైన వ్యవహారాల్లో నోటీసులు ఇవ్వకుండా.. నేరుగా చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని... బహిరంగ నోటీసు ఆధారంగా అధికారులు తీసుకోబోయే చర్యలను నిలువరించాలని కోరారు. సోమవారం జరిగిన విచారణలో సీనియర్ న్యాయవాదుల వాదనలు ముగియగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనల కోసం విచారణ ఇవాల్టికి వాయిదా పడింది.