మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే అధికారం మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఆ నిర్ణయం రాజ్యాంగబద్ధమేనని మంగళవారం విన్నవించింది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల (ఎస్ఈబీసీ) జాబితాను ప్రకటించకుండా రాష్ట్రాల అధికారాలను రాజ్యాంగంలోని 102వ సవరణ ఏ మాత్రం అడ్డుకోవడం లేదని వివరించారు. ఈ సవరణ చట్టం 388బి, 342ఎ అనే రెండు అధికరణాలను జోడించింది. జాతీయ బీసీ కమిషన్ నిర్మాణం విధులు, అధికారాలను 338బి పేర్కొంటోంది. ఒక నిర్దిష్ట కులాన్ని ఎస్ఈబీసీగా నోటిఫై చేసేందుకు రాష్ట్రపతికి ఉన్న అధికారాన్ని, సదరు జాబితాలో మార్పులు చేసేందుకు పార్లమెంటుకు ఉన్న అధికారాలను 342ఏ ప్రస్తావిస్తోంది.
మరాఠాలకు కోటా కల్పించడంపై దాఖలైన పిటిషన్లపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చేపట్టిన విచారణలో ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. మరాఠాలకు కోటా ఇచ్చేందుకు మహారాష్ట్ర తెచ్చిన ఎస్ఈబీసీ చట్టం- 2018 రాజ్యాంగబద్ధమేనని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. ఈ అంశంలో అటార్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్ చేసిన వాదనలను కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాలుగానే పరిగణించాలని కోరారు. ఎస్ఈబీసీలను నిర్ధరిస్తూ చట్టాన్ని చేసేందుకు రాష్ట్రాలకు ఉన్న హక్కులను 102వ రాజ్యాంగ సవరణ హరించడం లేదని ఈ నెల 18న అటార్నీ జనరల్.. కోర్టుకు విన్నవించడాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
'ఆ అధికరణానికి స్పష్టత లేదు'
ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ''342ఏ అధికరణం కింద ఎస్ఈబీసీలపై కేంద్రం ఇప్పటివరకూ ఎందుకు నోటిఫికేషన్ జారీ చేయలేదు? గవర్నర్ను సంప్రదించి.. రాష్ట్రపతి ఈ జాబితాను విడుదల చేయాలి కదా" అని ప్రశ్నించింది. దీనికి మెహతా బదులిస్తూ.. ఎస్ఈబీసీలపై ప్రస్తుతమున్న జాబితా కొనసాగుతుందని తెలిపారు.
అలాంటప్పుడు ఆ జాబితాను రాజ్యాంగ సవరణ చట్టంలో అంతర్భాగం చేయాల్సింది కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. 342ఏ అధికరణానికి సరైన భాష్యం లేదని, జాబితా లేకపోవడం వల్ల పడే ప్రభావంపైనా స్పష్టత కరవైందని వ్యాఖ్యానించింది. 102వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సమయంలో ఈ అంశాలపై సమాధానాలు లభిస్తాయని మెహతా చెప్పారు. దీంతో ఆ పిటిషన్‌పై విచారణ సమయంలో మెహతా వాదనలను మరోసారి వింటామని ధర్మాసనం పేర్కొంది. అయితే ఎస్ఈబీసీ జాబితాను విడుదల చేసే రాష్ట్రాల అధికారానికి 102వ సవరణ వల్ల గండిపడలేదని గనుక సుప్రీంకోర్టు తేలిస్తే ఆ పరిస్థితి ఉత్పన్నం కాబోదని మెహతా చెప్పారు. ఎస్ఈబీసీ జాబితాను జారీ చేసే రాష్ట్రాల అధికారాన్ని ఈ సవరణ హరించిందన్న భావనతోనే దాన్ని సవాల్ చేశారని తెలిపారు.
ఇదీ చదవండి: యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాలు విడుదల