ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఊరేగింపునకు వెళ్తూ.. కరెంట్ షాక్‌కు గురై ఏడుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని నాన్‌పురా ప్రాంతానికి చెందిన కొందరు గ్రామస్థులు.. స్థానికంగా జరిగే బరాఫవత్ ఊరేగింపు వేడుకకు ఓ వాహనంలో బయలుదేరారు. అయితే మార్గమధ్యలో మసుపుర్ గ్రామ సమీపంలో వారు ప్రయాణిస్తున్న వాహనంలో ఉన్న ఇనుప రాడ్డు.. హైటెన్షన్ వైర్‌కు తగిలింది. దీంతో వాహనంలో ఉన్నవారు ఇనుప రాడ్డుకు ఆనుకుని కూర్చుని ఉండడం వల్ల విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకున్నారు. అక్కడికక్కడే నలుగురు ప్రయాణికులు మరణించారని, మరో ముగ్గురు చికిత్స పొందుతూ చనిపోయారని పోలీసులు తెలిపారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. అధికారులను ఆదేశించారు.