ప్రసవ సమయంలో గుండెపోటుతో మరణించింది ఓ కొవిడ్ రోగి. మరోవైపు.. పుడుతూనే పాల కోసం ఏడుస్తోంది ఆమెకు జన్మించిన చిన్నారి. ఆ చిన్నారి ఆకలి బాధను చూడలేక.. కృష్ణుడిని పెంచిన యశోదలా ఎందరో తల్లులు ముందుకువచ్చారు. బ్రెస్ట్‌ఫీడింగ్ చేస్తూ దయాహృదయం చాటుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర నాగ్‌పుర్‌లో జరిగింది.
ఇదీ జరిగింది..
నాగ్‌పుర్‌కు చెందిన మీనల్ వెర్నెకర్కు, ఠాణెకు చెందిన చేతన్‌తో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఇరువురూ ఠాణెలో నివసిస్తున్నారు. అయితే.. గర్భవతి అయ్యాక డెలివరీ నిమిత్తం మీనల్ నాగ్‌పుర్‌లోని తన అమ్మవాళ్లింటికి వెళ్లింది. ఎనిమిదో నెల రాగానే మీనల్‌కు కరోనా సోకింది. వెంటనే కింగ్స్‌వే ఆసుపత్రిలో చేర్పించారు ఆమె తల్లితండ్రులు.
ప్రసవించే సమయంలో మీనల్ గుండెపోటుతో మరణించింది. అయినప్పటికీ చివరి నిమిషాల్లో.. వైద్యులు జాగ్రత్తగా ఆపరేషన్ చేసి మీనల్ బిడ్డకు ఆయువు పోశారు.
ఎందరో తల్లులై..
మీనల్.. మరణించడానకి ముందు తనకు పుట్టబోయే బిడ్డకు ఇవాన్ అని పేరు పెట్టాలని ఆశించినట్లు డాక్టర్లు తెలిపారు. ఆపరేషన్ అనంతరం.. ఇవాన్ తల్లి పాలు మాత్రమే తాగాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో.. ఎందరో మహిళలు ఆ పసిబిడ్డకు బ్రెస్ట్‌ఫీడింగ్ చేసేందుకు ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఇవాన్ ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మరో రెండు నెలల పాటు చిన్నారి తల్లి పాలు మాత్రమే తాగాలని అన్నారు.
ఇదీ చదవండి:ప్రముఖ యూట్యూబర్ సాపట్టు రమణ్ అరెస్టు