ముకేశ్ అంబానీ ఇంటి పరిసరాల్లో లభించిన పేలుడు పదార్థాల కారు యజమాని మన్సుఖ్ హిరేన్ మృతి కేసు విచారణను ముమ్మరం చేసేందుకు ఎన్ఐఏకు మరింత సమయం దక్కింది. మన్సుఖ్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు కానిస్టేబుల్ వినాయక్ షిందే, బుకీ నరేశ్ ఘోర్‌ను మరింత విస్తృతంగా విచారించేందుకు ఎన్ఐఏకు ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది. ఈ మేరకు వారి కస్డడీని ఏప్రిల్ 7వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
వ్యాపారవేత్త మన్సుఖ్ మృతి వెనకున్న రహస్యాలు కనుగొనేందుకు నిందితుల కస్టడీని పొడిగించాలని కోర్టును ఎన్‌ఐఏ కోరింది. అంబాని ఇంటి ఎదుట పేలుడు పదార్థాల ఘటనకు, మన్సుఖ్ మృతికి సంబంధం ఉన్నట్లు కోర్టుకు తెలిపింది. ఎన్‌ఐఏ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం నిందితులకు ఏప్రిల్ 7 వరకు కస్టడీని పొడిగించింది.
ఆ భేటీలో..
హిరేన్ హత్యకు పథకం రచించేందుకు భేటీ అయిన సమయంలో ముంబయి పోలీసు అధికారి సచిన్ వాజేతోపాటు మరో కానిస్టేబుల్ వినాయక్ షిండే కూడా అక్కడే ఉన్నట్లు జాతీయ దర్యాప్తు బృందం(ఎన్‌ఐఏ) వెల్లడించింది. అంతేకాకుండా కుట్రపన్నిన వారితో మాట్లాడేందుకు ఓ మొబైల్ ఫోన్‌ను సచిన్ వాజే ఉపయోగించినట్లు కోర్టుకు తెలిపింది. అయితే, కుట్ర వెనకున్న ఉద్దేశాన్ని త్వరలోనే కనుగొంటామని కోర్టుకు సమర్పించిన తాజా నివేదికలో ఎన్‌ఐఏ పేర్కొంది.
ఇందుకు సంబంధించిన ఆధారాలు సేకరించామని కోర్టుకు సమర్పించిన నివేదికలో ఎన్‌ఐఏ పేర్కొంది.
62 బుల్లెట్లు..
హత్యకు ఉపయోగించినట్లు భావిస్తోన్న 14 సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లను సేకరించే పనిలో ఎన్‌ఐఏ నిమగ్నమైంది. దర్యాప్తులో భాగంగా సచిన్ వాజే ఇంట్లో జరిపిన సోదాల్లో 62 బుల్లెట్లను కూడా ఎన్‌ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ లెక్కలోనికి రానివి కావడం గమనార్హం. వాజే సర్వీస్ రివాల్వర్‌కు సంబంధించిన 30 బుల్లెట్లలో కేవలం ఐదింటిని మాత్రమే అధికారులు గుర్తించారు. మిగిలిన వాటి గురించి నిందితుడు ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదని ఎన్‌ఐఏ అధికారులు ఇదివరకే కోర్టుకు తెలిపారు.
ఇదీ చదవండి : 'హిరేన్ మృతి కేసు కథ ముగిసింది!'