Manipur Violence News : ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో మరోసారి హింస ప్రబలింది. తెగల మధ్య వైరంతో అట్టుడికిపోతున్న ఆ రాష్ట్రంలో శుక్రవారం ఉదయం మళ్లీ కాల్పుల ఘటన జరిగింది. ఉఖ్రుల్ జిల్లాలో సాయుధ దుండగులు కాల్పులకు తెగబడ్డారు. కుకీ తెగవారు నివసించే తోవాయి కుకీ గ్రామంపై ఈ దాడి జరిగిందని జిల్లా పోలీసు అధికారి ఎన్ వాషుమ్ తెలిపారు. ఉదయం 4.30 గంటల సమయంలో సాయుధ మూకలు కొండపై నుంచి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాయని వెల్లడించారు. ఈ ఘటనలో తోవాయి గ్రామానికి చెందిన ముగ్గురు చనిపోయారని చెప్పారు.
కాల్పుల సమాచారం నేపథ్యంలో అక్కడికి వెళ్లిన భద్రతా బలగాలకు ముగ్గురి మృతదేహాలు లభించాయి. వారంతా 24 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గలవారని పోలీసులు తెలిపారు. పదునైన కత్తులతో హత్య చేశారనీ.. చంపడానికి ముందు అవయవాలను నరికినట్లు పోలీసులు తెలిపారు. హింస నేపథ్యంలో గ్రామంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. హింసకు పాల్పడ్డవారిని గుర్తించి, పట్టుకునేందుకు రాష్ట్ర పోలీసులు, భారత సైన్యం సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయని ఎస్పీ వాషుమ్ వెల్లడించారు.
సురక్షిత ప్రాంతాలకు ప్రభుత్వ ఉద్యోగులు
మణిపుర్‌లో హింస ఇంకా చల్లారని నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. పోలీసులతో సహా మొత్తం 2వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేసింది. సుప్రీంకు అందజేసిన నివేదికలో ప్రభుత్వం ఈ విషయాన్ని పేర్కొంది. హింస నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టుల్లోని సిబ్బంది మధ్య కూడా అంతరాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో వారిని ఆయా ప్రాంతాలకు బదిలీ చేశారు.
కుకీ-జో ఆదివాసులు ఎక్కువ ఉన్న చురాచాంద్‌పుర్, కాంగ్‌పోక్పి, చందేల్, తాంగ్నౌపాల్, ఫర్జాల్‌కు కలిపి ప్రత్యేక కార్యదర్శి, డీజీపీలను నియమించాలని ఆ రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల ఎమ్మెల్యేలు ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇంఫాల్ లోయ సురక్షితం కాదనీ.. హైకోర్టు, సచివాలయం, పోలీసు ప్రధాన కార్యాలయం అక్కడే ఉన్నందున.. తమకు ప్రత్యేక కార్యాలయాలు అవసరమని మైనారిటీ ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. అప్పుడే తమ వర్గాల ప్రభుత్వ ఉద్యోగులకు సమస్యలు తగ్గుతాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఐఏఎస్‌లు, డ్రైవర్లు, ప్యూన్లు, సెక్యూరిటీ గార్డులు, స్కూల్ టీచర్లను సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.
అసెంబ్లీకి వెళ్లేందుకు భయపడుతున్న కుకీ ఎమ్మెల్యేలు.. సర్కార్‌కు ఆ పార్టీ మద్దతు ఉపసంహరణ!
మణిపుర్‌లో ఆగని అల్లరిమూకల ఆగడాలు.. 15 ఇళ్లకు నిప్పు.. ఓ వ్యక్తిపై కాల్పులు..