Manipur violence : మణిపుర్లో తాజాగా జరిగిన అల్లర్లలో 9 మంది మరణించారు. మణిపుర్‌లోని ఓ చర్చిలో దుండగులు కాల్పులకు తెగబడడం వల్ల.. ఒక మహిళతో సహా 9 మంది మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. తూర్పు ఇంఫాల్‌లోని ఖమెన్లోని ఓ చర్చిలో మంగళవారం రాత్రి దుండగులు కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిగే సమయంలో చర్చిలో 25 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులు ప్రస్తుతం ఇంఫాల్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో కుకీ మిలిటెంట్ ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
అమిత్ షా పర్యటించినా..
తీవ్రమైన ఉద్రిక్తతలు చెలరేగడం వల్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా మణిపుర్లో నాలుగు రోజుల పాటు పర్యటించారు. వివిధ గిరిజన సంఘాలతో భేటీ అయ్యారు. వారి మధ్య శాంతి సయోధ్యలు నెలకొల్పడానికి మణిపుర్ గవర్నర్ ఆధ్వర్యంలో 'శాంతి కమిటీ'ని ఏర్పాటు చేశారు. ఘర్షణల్లో మరణించిన వారికి కుటుంబాలకు 10 లక్షల వరకు పరిహారం, అలాగే బాధిత కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ కూడా ఇచ్చారు. మణిపుర్లో నెలకొన్న ఉధృత పరిస్థితులపై విచారణ జరిపించేందుకు త్వరలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రాష్ట్రంలో అల్లర్లు జరిపించడానికి జరుగుతున్న కుట్రలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో కూడా విచారణ జరిపిస్తామని వెల్లడించారు.
నివురుగప్పిన నిప్పులా
మణిపుర్లో చాలా కాలంగా కుకీ, మైతీ తెగల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. మే నెల నుంచి ఇప్పటి వరకు ఈ ఘర్షణల్లో దాదాపుగా 100 మంది వరకు మరణించగా, 310 మంది వరకు క్షతగాత్రులయ్యారు. మణిపుర్లో దాదాపు 53 శాతం మంది మైతీలు ఉన్నారు. నాగాలు, కుకీ తెగ గిరిజనులు 40 శాతం వరకు ఉన్నారు. అయితే రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న మైతీలకు ఎస్టీ హోదా కల్పించడానికి జరుగుతున్న ప్రయత్నాలను ఇతర గిరిజన తెగలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇందులో భాగంగా మైతీలకు కుకీ తెగ గిరిజనులకు మధ్య హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా వరకు ప్రాణనష్టం, కోట్లలాది రూపాయల విలువైన ఆస్తుల విధ్వంసం జరిగాయి. అనేక మంది నిరాశ్రయులయ్యారు. కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. భద్రతా బలగాల మోహరింపు, పెట్రోలింగ్ లాంటి పటిష్ట చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇరువర్గాల మధ్య వైరం నివురు గప్పిన నిప్పులానే ఉంది.
ఇవీ చదవండి :