Manipur CBI Investigation : మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ- సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఆ ఘటనతో సంబంధం ఉన్న ఆరుగురు వ్యక్తులతో పాటు ఓ మైనర్పై ప్రత్యేక కోర్టులో సోమవారం సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మణిపుర్ పోలీసులు అరెస్టు చేసిన నిందితులకు ఈ ఘటనలో ప్రమేయం ఉన్నట్లు తేలిందని సీబీఐ పేర్కొంది.
వివిధ సెక్షన్ల కింద అభియోగాలు..
Manipur CBI Probe : ఈ కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లు సీబీఐ చెప్పింది. నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపినట్లు పేర్కొంది. సామూహిక అత్యాచారం, హత్య, మహిళ పట్ల అసభ్య ప్రవర్తన, నేరపూరిత కుట్ర వంటి నేరాల కింద అభియోగాలు మోపినట్లు సీబీఐ తెలిపింది.
కేసు ఏంటంటే?
Manipur Women Paraded : జులై నెలలో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. అయితే ఈ ఘటనపై దర్యాప్తును సీబీఐకు అప్పగించింది
పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన వివరాల ప్రకారం.. కాంగ్‌పోప్కి జిల్లాలో తమ వర్గానికి చెందిన ఓ మహిళపై అత్యాచారం చేశారన్న ఆరోపణలపై కొందరు యువకులు మరో వర్గానికి చెందిన గ్రామాలపై దాడులకు దిగారు. ఇందులో భాగంగా తమ ఊరిపై కూడా వారు దాడి చేస్తారనే సమాచారంతో మే 4న బీ.ఫయనోమ్ గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
సురక్షిత ప్రాంతానికి వెళ్లే క్రమంలో వారికి.. నాంగ్‌పోక్ సెక్‌మై వద్ద పోలీసులు కనిపించగా వారి వద్దకు వెళ్లారు. అంతలోనే దాదాపు వెయ్యి మందితో ఉన్న భారీ గుంపు ఆ గ్రామంలోకి ప్రవేశించి ఐదుగురిని అడ్డగించింది. అనంతరం పోలీసుల దగ్గరి ఆయుధాలు లాక్కొని దాడికి పాల్పడింది. అందులోని యువకుడు తన సోదరిని రక్షించేందుకు ప్రయత్నించాడు. కానీ, సాయుధ మూకల దాడిలో అతడితోపాటు యువతి తండ్రి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. అనంతరం 21 ఏళ్ల యువతితోపాటు మరో మహిళను నగ్నంగా ఊరేగిస్తూ సమీప పొలాల్లోకి తీసుకెళ్లారు. ఇద్దరిలో ఒకరిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత కుటుంబం ఆరోపించింది. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు మే 18నే జీరో ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది. మే 4న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో జులై 19న సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
Manipur Violence : విద్యార్థుల హత్యతో మళ్లీ ఉద్రిక్తత.. ప్రత్యేకాధికారాల చట్టం మరో 6 నెలలు పొడిగింపు